బరితెగించేశారు డబ్బున్న పిల్లలు.. హత్యలు చేసినా.. కార్లతో ఢీకొట్టి చంపినా భయమే లేదు.. ఏమన్నా అంటే మా నాన్న చూసుకుంటాడు.. మా అయ్య చూసుకుంటాడు అంటూ బలుపు మాటలు మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ సిటీలో రెండు హిట్ అండ్ రన్ కేసులు నమోదు అయ్యాయి.. ఆ కేసుల్లో ఏమైందో దేశం మొత్తం చూసింది.. ఇప్పుడు కేరళ రాష్ట్రం కొచ్చీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. దేశం మొత్తాన్ని నివ్వెరపరుస్తుంది.
19 ఏళ్ల కొడుకు బర్త్ డే గిఫ్ట్ కింద కోట్ల రూపాయల మినీ కూపర్ కారు కొనిచ్చాడు తండ్రి.. ఆ కొత్త కారులో తన ఫ్రెండ్స్‌ను తీసుకుని పార్టీ కోసం బయటకు వచ్చాడు కొడుకు. రోడ్డుపై వాహనాలను ఢీకొట్టి మనుషులను చంపాడు.. ఆ తర్వాత ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా ఏమున్నా.. ఏమైనా మా నాన్న చూసుకుంటాడు.. మా అయ్య చూసుకుంటాడు అంటూ ఆ 19 ఏళ్ల కుర్రోడు మాట్లాడటం ఇప్పుడు అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళలోని ఎర్నాకులం జిల్లా కొచ్చి విమానాశ్రయం సమీపంలో ఆదివారం (అక్టోబర్ 11) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ మినీ కూపర్ కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. కారును నడుపుతున్న 19 ఏళ్ల సుహైల్ సజీవ్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అతివేగంగా కారు నడిపి ముగ్గురు ప్రాణాలను తీశావని సుహైల్‌ను స్థానికులు ప్రశ్నించగా, నో ప్రాబ్లమ్.. మా నాన్న అంతా చూసుకుంటాడు అంటూ నిర్లక్ష్యంగా, అహంకారపూరితంగా సమాధానం చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ముగ్గురు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాననే పశ్చాత్తాపం అతనిలో ఏమాత్రం లేదని.. డబ్బు బలుపు, అహంకారంతో మాట్లాడానని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతులను దేవిక (21), గోపిక (22), ఇజాజ్ (21) గుర్తించారు పోలీసులు.
వీరంతా కాక్కడ్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. రాత్రి సమయంలో టీ తాగి ఆఫీస్ కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సుహైల్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు మద్యం మత్తులో కారు డ్రైవ్ చేశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం సుహైల్‌ను ఆసుపత్రికి తరలించగా.. తాను కేవలం బీరు మాత్రమే తాగి డ్రైవ్ చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. నిందితుడి బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని.. రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.
