భద్రాద్రి అభివృద్ధికి రూ.351 కోట్లు మంజూరు..పరిపాలనా అనుమతులు ఇచ్చిన సర్కార్‌‌

భద్రాద్రి అభివృద్ధికి రూ.351 కోట్లు మంజూరు..పరిపాలనా అనుమతులు ఇచ్చిన సర్కార్‌‌
  • మొత్తం రూ.586 కోట్లతో మూడు దశల్లో డెవలప్‌‌మెంట్‌‌ వర్క్స్‌‌
  • మొదటి దశ పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చిన సర్కార్‌‌
  • కల్యాణ మండపం, క్యూలైన్లు, ఆఫీస్‌‌ బిల్డింగ్స్‌‌, రాజ వీధి విస్తరణ వంటి పనులు చేపట్టనున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం రూపురేఖలు మారనున్నాయి. ఆలయ పునర్నిర్మాణం, ఆధునికీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. భద్రాద్రి దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.351 కోట్లను మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మూడు దశల్లో రూ.586 కోట్లతో పనులు చేపట్టేందుకు మాస్టర్‌‌ ప్లాన్‌‌ రూపొందించింది. ఇందులో భాగంగా మొదటి దశ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ జీవో జారీ చేశారు. సీఎం రేవంత్​రెడ్డి గత పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులను కేటాయించారు.

మొదటి దశలో కల్యాణ మండపం, క్యూలైన్లు..

రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి ఆలయాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది.  ఇందులో మొదటి దశకు సంబంధించి రూ.351 కోట్లు మంజూరు చేసింది. రెండో దశలో  రూ.108 కోట్లు, మూడో దశలో రూ.127 కోట్లు కేటాయించనున్నది. మొదటి దశలో వచ్చిన నిధుల్లోంచి రూ.180 కోట్లతో కొత్తగా నిత్య కల్యాణ మండపం, అత్యాధునిక క్యూలైన్ మేనేజ్‌‌మెంట్‌‌ మండపాలు, రెండో ప్రాకారంలో త్రితల గోపురాలు, రామకోటి సమర్పణ మందిరం, హుండీ లెక్కింపు హాల్ నిర్మించనున్నారు. రూ.75 కోట్లతో ఉత్తర, దక్షిణ ఘాట్ల విస్తరణతో పాటు భక్తుల కోసం మెట్లు, సీటింగ్, చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నారు. 

గోదావరి హారతి కోసం ప్రత్యేక ప్లాట్‌‌ఫామ్‌‌ నిర్మిస్తారు. మరో రూ.96 కోట్లతో ఈవో ఆఫీస్, అడ్మినిస్ట్రేటివ్‌‌ బిల్డింగ్, ప్రసాదం తయారీ బ్లాక్‌‌ నిర్మించనున్నారు. గోవిందరాజస్వామి ఆలయం వరకు రాజవీధి విస్తరణ కోసం భూసేకరణ చేపట్టనున్నారు. కాగా,  ఆలయ అభివృద్ధి పనుల బాధ్యతను ప్రభుత్వం ఆర్అండ్‌‌బీ శాఖకు అప్పగించింది. 2026-–27 బడ్జెట్‌‌ నుంచి ఈ నిధులను వెచ్చించనున్నారు. పనులన్నీ ఆగమశాస్త్ర నియమాలకు లోబడి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే టెండర్లు పిలవనుంది.  

మంత్రి కొండా సురేఖ హర్షం

భద్రాద్రి రామాలయ అభివృద్ధికి నిధులు కేటాయించడంపై మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు పట్ల సీఎం రేవంత్‌‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, భద్రాచలం క్షేత్ర వైభవాన్ని ప్రపంచానికి చాటడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్టుతో పర్యాటక రంగానికి కొత్త ఊపు లభించడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.