
- అధికారుల తీరుపై దళిత సంఘాల నేతల ఆగ్రహం
బషీర్‌బాగ్, వెలుగు : సరస్వతి పుష్కరాల నేపథ్యంలో ఆఫీసర్లు ప్రొటోకాల్ పాటించకుండా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానించారని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో శనివారం దళిత సంఘాల సమావేశం నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్ మాట్లాడుతూ.. ఎంపీ వంశీకృష్ణ దళితుడైనందునే పుష్కరాలకు ఆహ్వానించలేదని ఆరోపించారు.
ఇది యావత్ దళితజాతికి జరిగిన అవమానంగా భావిస్తున్నామన్నారు. ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, ఇతర ఆఫీసర్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ హౌస్‌కమిటీకి అప్పీల్ చేస్తామని చెప్పారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. బిట్లు వెంకటేశ్వర్లు, మన్నె శ్రీధర్‌రావు, మధు, జంగా శ్రీనివాస్, ఎన్.వెంకటేశ్, దాసరి విశాల్, ఆవుల సుధీర్, చేతన్ పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమీషన్‌కు ఫిర్యాదు
సిద్దిపేట/గోదావరిఖని : సరస్వతి పుష్కరాల సందర్భంగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకుండా అవమానించారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ శనివారం హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. ఆహ్వాన పత్రికలలో ఎంపీ ఫొటో పెట్టకపోవడం, ఆయనను ఆహ్వానించకపోవడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దేవాదాయ శాఖ ఆఫీసర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు. హైకోర్టు న్యాయవాది దివాకర్ పూలే, నాయకులు బిట్ల వెంకటేశ్వర్లు, రాజు ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు సైతం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీకి
సిఫారసు చేశారు.
ఎంపీని ఆహ్వానించకపోవడం సరికాదు
సూర్యాపేట, వెలుగు : సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం సరికాదని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు హుస్సేన్ అన్నారు. సూర్యాపేట పట్టణంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ఎంపీ వంశీకృష్ణకు జరిగిన అవమానం.. దళిత జాతికి జరిగినట్లుగా భావిస్తున్నామన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ బాధ్యత వహించాలని, ఎంపీకి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిడ్ల పరంజ్యోతిరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి మేకతొట్టి కాంతయ్య, బండి అశోక్, రాష్ట్ర కార్యదర్శి బేగరి శివరాజు, దాసరి దేవయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామర్ల జానయ్య, అన్నంపల్లి ఎల్లన్న, తెలంగాణ జిల్లాల బాధ్యులు బోయిల అఖిల్, దండు రాజు, నీలగిరి రాజు, కట్ట దుర్గాప్రసాద్ ఉన్నారు.
సీఎస్‌ను కలిసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
హైదరాబాద్: సరస్వతి పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణకు జరిగిన అవమానంపై దేవాదాయ శాఖ కమిషనర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. వంశీకృష్ణ దళితుడనే దేవాదాయ శాఖ అధికారులు అవమానించారని ఆరోపించారు. శనివారం సెక్రటేరియేట్‌లో సీఎస్‌ను కలిసి ఎంపీ వంశీకృష్ణ ప్రోటోకాల్ విషయాన్ని వివరించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం బక్కి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే దేవాదాయ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పుష్కరాల ఫ్లెక్సీలో ఎంపీ ఫొటో లేకపోవడం, కరపత్రంలో పేరు రాయకపోవడం చాలా బాధాకరమన్నారు. దీనిపై దళిత సంఘాలన్నీ ఉద్యమం చేస్తామని చెప్పడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనే సీఎస్‌ను కలిసినట్లు తెలిపారు. ఏడాది నుంచి ఆయన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల శిలాఫలకాలపై పేరు పెట్టకుండా, అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించకుండా కలెక్టర్, జిల్లా యంత్రాంగం అవమానపరుస్తోందన్నారు.