రాష్ట్ర కాంగ్రెస్కు కోవర్టిజమనే కొత్త రోగం పట్టుకుందని మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ లీడర్ దామోదర రాజనర్సింహ అన్నారు. గత 8 ఏళ్లుగా కాంగ్రెస్లో కోవర్టిజం కొనసాగుతోందన్నారు. సిద్దిపేట జిల్లాలో కోవర్టులకే పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కావాలనే కోవర్టులను ప్రోత్సహిస్తున్నారని..ఈ కల్చర్ పోవాలని డిమాండ్ చేశారు. కోవర్టులతో కాంగ్రెస్కు ఒరిగేదేమి లేదని చెప్పారు. సమయం వచ్చినప్పుడు కోవర్టుల పేర్లను బయటపెడతానని వెల్లడించారు.
అనర్హులకు పదవులు..
కాంగ్రెస్లో ప్రక్షాళన జరగాలని దామోదర రాజనర్సింహ ఆకాంక్షించారు. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత సీనియర్ లీడర్ గా తనపై ఉందన్నారు. రెండు, మూడు నెలల కిందట పార్టీలోకి వచ్చిన వారికి కాంగ్రెస్ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. అలాంటి వారికి పదవులు ఇచ్చి..పార్టీకి ఎన్నో ఏళ్ల నుంచి సేవ చేస్తున్న వారిని విస్మరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పదవుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ముస్లింలకు చోటు కల్పించలేదన్నారు. పీసీసీ కమిటీల్లో అనర్హులకు పదవులు ఇచ్చారని మండిపడ్డారు. కోవర్టులు లేకుండా పీసీసీ కమిటీల లిస్ట్ ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు.
అసలైన కార్యకర్తను..
తాను ఎవరికి వ్యతిరేకం కాదని దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. తాను 58 ఏళ్లుగా కాంగ్రెస్ లో కొనసాగుతున్నానని చెప్పారు. ఒకే నియోజకవర్గంలోనే 50 ఏళ్లకు పైగా పని చేస్తున్నాని తెలిపారు. తాను అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తనని వెల్లడించారు. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను కార్యకర్తలు ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. తాను హై కమాండ్ ను గౌరవిస్తానని చెప్పారు.

