
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో దండి యాత్ర ఎంతో కీలకమని ప్రధాని మోడీ అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలకు గుర్తుగా గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి 'అమృత్ మహోత్సవ్' కార్యక్రమాన్ని మోడీ శుక్రవారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో 75 వారాల పాటు 'అమృత్ మహోత్సవ్' నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. భారత్ విజయాలు, ఘనతలను ప్రపంచం గుర్తిస్తోందన్నారు.
‘దేశ స్వాతంత్ర్యోద్యమంలో దండి యాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ఫ్రీడమ్ స్ట్రగుల్‌ను పక్కనబెడితే మన స్వప్నాలను సాకారం చేసుకోవడంలో ఆలోచనలు, విజయాలు, చర్యలు, పరిష్కారాలు స్ఫూర్తిగా నిలుస్తాయి. మన దేశం ఎంతగా అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అంత వేగంగా డెవలప్ అవుతుంది. మన ప్రజాస్వామ్య ఆచారాలపై మనందరం గర్వపడాలి. ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు. భారత ప్రాచీన చరిత్రను కాపాడుకోవడానికి గత ఆరేళ్లుగా ఎంతో శ్రమిస్తున్నాం. దండి యాత్రలో కీలకమైన ఉప్పు ఆత్మనిర్భరతకు సూచిక’ అని మోడీ చెప్పారు.