శ్రవణ్​తో పాటు వందల మంది 21న బీజేపీలోకి వస్తరు

శ్రవణ్​తో పాటు వందల మంది 21న బీజేపీలోకి వస్తరు

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగవుతుందని, అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ రెండు పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తో పాటు వందల సంఖ్యలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బ్యూరోక్రాట్ లు బీజేపీలో చేరనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 21 న అమిత్ షా సమక్షంలో వారంతా కాషాయ కండువా కప్పుకోనున్నారని వివరించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఈటల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నెత్తిన శని ఉందని, పోయేకాలం వచ్చిన తర్వాత ఎవరూ ఆపలేరన్నారు. వెకిలి, మకిలి చేష్టలతో కేసీఆరే అభాసుపాలవుతున్నారని పేర్కొన్నారు.టీఆర్ఎస్ నాయకుడు చిల్లర వేషాలు వేస్తున్నారని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఈటల ఫైర్ అయ్యారు.  

సీఎం మనుమడిని గురుకులాలకు పంపాలి

‘‘సీఎం కేసిఆర్ గొప్ప స్పీచ్ లు ఇస్తడు. ఆయన మనవడు తినే ఫుడ్ గురుకులాల్లో పెడుతున్నామని చెప్తన్నరు. సీఎం మనవడిని కొన్ని రోజులు గురుకులాలకు పంపాలి. అతను అక్కడే స్నానం చేయాలి. అక్కడి తిండి తిని పడుకోవాలి. అప్పుడు వాస్తవాలు తెలుస్తయ్. స్తూరిబా బాలికా విద్యాలయాలు, బాసర ట్రిపుల్ ఐటీలో సైతం క్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదు. గురుకులాల్లో చదువుతున్న తమ పిల్లలకు ఎప్పుడు ఫుడ్ పాయిజన్  అవుతుందోనని పేరెంట్స్​ ఆందోళన చెందుతున్నరు” అని ఈటల అన్నారు.