ఢిల్లీ తడబ్యాటు..ముంబై లక్ష్యం 160

ఢిల్లీ తడబ్యాటు..ముంబై లక్ష్యం 160


ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ కాపిటల్స్ బ్యాటింగ్లో  తడబడింది. బ్యాటింగ్లో పటిష్టంగా ఉన్న ముంబైకు కేవలం 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫాంలో ఉన్న డేవిడ్ వార్నర్..5 పరుగులే చేసి డానియల్ సామ్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత వన్ డౌన్లో వచ్చిన మిచెల్ మార్ష్ డకౌట్గా వెనుదిరిగాడు. కొద్దిసేపటికే పృథ్వీ షాను బుమ్రా బుట్టలో వేసుకున్నాడు. దీంతో ఢిల్లీ 31 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరో 20 పరుగుల వ్యవధిలో ఢిల్లీ మరో వికెట్ను చేజార్చుకుంది. 10 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ను మయాంక్ మార్కండే పెవీలియన్ చేర్చాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్..పావెల్తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే స్కోరు వంద దాటింది. 39 పరుగులతో రాణించి పంత్, 43 పరుగులు చేసిన పావెల్ స్వల్ప వ్యవధిలో  ఔటయ్యారు. ఆల్ రౌండర్ శార్దూల్ కూడా విఫలమయ్యాడు. అయితే చివర్లో మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ బ్యాట్ ఝుళిపించడంతో..ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా, రమణదీప్ సింగ్ రెండు, డానియల్ సామ్స్ ఒక వికెట్ తీసుకున్నారు.