పాల ఉత్పత్తి పెంచేందుకు ఇంజెక్షన్ల దందా!..పటాన్‌‌‌‌ చెరులో రెండు పశుగ్రాస దుకాణాలపై డీసీఏ దాడులు

పాల ఉత్పత్తి పెంచేందుకు ఇంజెక్షన్ల దందా!..పటాన్‌‌‌‌ చెరులో రెండు పశుగ్రాస దుకాణాలపై డీసీఏ దాడులు
  • 160 బాటిళ్ల ఆక్సిటోసిన్ స్వాధీనం

హైదరాబాద్, వెలుగు:  ఎక్కువ పాల దిగుబడి కోసం మూగజీవాలను హింసిస్తూ, అడ్డదారిలో లాభాలు గడిస్తున్న కేటుగాళ్లపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు కొరడా ఝుళిపించారు. పటాన్‌‌‌‌చెరు పరిధిలోని రెండు పశుగ్రాస దుకాణాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఆక్సిటోసిన్  ఇంజెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో డీసీఏ అధికారులు గురువారం పటాన్‌‌‌‌ చెరులో తనిఖీలు చేపట్టారు. పాటి ఎక్స్ రోడ్డులోని శ్రీ రేణుక క్యాటిల్ ఫీడ్ లో సోదాలు చేసి, యజమాని ఆర్.సాయికృష్ణ గౌడ్ వద్ద నుంచి 40 బాటిళ్ల (200 ఎంఎల్) ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను పట్టుకున్నారు.

ఎం.జీ. రోడ్డులోని లక్ష్మీ కృష్ణ క్యాటిల్ ఫీడ్ లో జరిపిన మరో దాడిలో యజమాని మైలారం సాయిరామ్ నుంచి 120 బాటిళ్ల (250 ఎంఎల్) అక్రమ స్టాక్‌‌‌‌ ను సీజ్ చేశారు.  డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం.. ఇలాంటి ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయించినా, నిల్వ ఉంచినా ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. డీసీఏ డిప్యూటీ డైరెక్టర్ కె. దాస్, అసిస్టెంట్ డైరెక్టర్ పి. రాము పర్యవేక్షణలో డ్రగ్ ఇన్‌‌‌‌స్పెక్టర్లు ఎం. చంద్రశేఖర్, ఎం. వరప్రసాద్, ఎన్. రవికిరణ్ రెడ్డి, టి. ప్రవీణ్ కుమార్ ఈ దాడుల్లో పాల్గొన్నారు. అక్రమ మందుల తయారీ, విక్రయాలపై ప్రజలు ఫిర్యాదు చేయాలని, టోల్ ఫ్రీ నంబర్ 1800–-599-–6969కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.