బీఈడీ అభ్యర్థుల వినతిపై నిర్ణయం తీసుకోండి.. గురుకుల బోర్డుకు హైకోర్టు ఆర్డర్స్

బీఈడీ అభ్యర్థుల వినతిపై నిర్ణయం తీసుకోండి.. గురుకుల బోర్డుకు హైకోర్టు ఆర్డర్స్

హైదరాబాద్, వెలుగు: రెసిడెన్షియల్‌‌‌‌ విద్యా సంస్థల్లో  టీజీటీ (ట్రైన్డ్‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌ టీచర్స్‌‌‌‌) మ్యాథ్స్‌‌‌‌ పోస్టులకు తమను కూడా అర్హులుగా ప్రకటించాలని బీటెక్‌‌‌‌, బీఈడీ అభ్యర్థులు చేస్తున్న వినతిపై 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. 2021 డిసెంబరులో హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల సమస్యను పరిష్కరించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీజీటీ మ్యాథ్స్ పోస్టులకు బీఎస్సీ, బీఈడీ అభ్యర్థులతో సమానంగా బీటెక్‌‌‌‌, బీఈడీ అభ్యర్థులను కూడా అర్హులుగా పరిగణించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను జస్టిస్‌‌‌‌ పి. కార్తీక్‌‌‌‌ విచారించారు. టీజీటీ (మ్యాథ్స్‌‌‌‌) పోస్టులకు బీఎస్సీ, బీఈడీని మాత్రమే అర్హతగా నిర్ణయించి బీటెక్, బీఈడీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని పిటిషనర్‌‌‌‌ తరఫు లాయర్ వాదించారు. టీజీటీ మ్యాథ్స్‌‌‌‌ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌‌‌‌ను రద్దుచేసి తిరిగి మరో నోటిఫికేషన్‌‌‌‌ ఇవ్వాలని కోరారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న  కోర్టు.. బీటెక్‌‌‌‌, బీఈడీలు  లేవనెత్తిన అంశంపై స్పందించాలని గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డును ఆదేశించింది.