- మూసీ పునరుజ్జీవంలో కీలక ముందడుగు
- రూ.533 కోట్ల డిఫెన్స్ భూములకు లైన్ క్లియర్
- గోల్కొండ పరిధిలో 83.81 ఎకరాల కేటాయింపు
- ఈవీఐ కింద కేంద్రం అనుమతి
- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
- అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు కీలక ముందడగు పడింది. మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవంలో అత్యంత కీలకమైన ఫేజ్-1 అభివృద్ధి పనులకు రక్షణ మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ, ఈసా నదులు సంగమించే చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద సుమారు 300 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పనుల నిర్వహణకు (వర్కింగ్ పర్మిషన్) కేంద్రం అధికారిక అనుమతులు మంజూరు చేసింది. ఈ కీలక అనుమతి లభించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఎక్స్ లో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఒక అద్భుతమైన సాంస్కృతిక, ప్రజా వారసత్వ సంపదగా మార్చేందుకు ఈ నిర్ణయం మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
డిఫెన్స్ భూముల.. ‘సరోవరం’ మార్గం సుగమం
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన భూ సమస్య రక్షణ శాఖ అనుమతులతో కొలిక్కి వచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం గుర్తించిన స్థలంలో కేంద్ర రక్షణ శాఖకు చెందిన భూములు ఉండటంతో ఇన్నాళ్లూ సస్పెన్స్ కొనసాగింది. అయితే, గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని రూ. 533.42 కోట్ల విలువైన 83.81 ఎకరాల డిఫెన్స్ భూమిని గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం ఉపయోగించుకునేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ చివరకు 'సమాన విలువ కలిగిన మౌలిక సదుపాయాల' (ఈవీఐ) పథకం కింద అనుమతించింది. ఇక్కడ మహాత్మా గాంధీ జీవిత విశేషాలు, ఆలోచనలను ప్రతిబింబించేలా నేషనల్ మ్యూజియం, ధ్యాన కేంద్రం (మెడిటేషన్ విలేజ్), హ్యాండ్లూమ్ ప్రమోషన్ సెంటర్, పబ్లిక్ రిక్రియేషన్ జోన్లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నారు. రక్షణ శాఖ భూముల అడ్డంకి తొలగిపోవడంతో ప్రభుత్వం ఇక వేగంగా పనులను ముందుకు తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతోంది.
7 వేల కోట్లతో భారీ ప్రణాళిక
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ నదిని 5 జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అందులో భాగంగా ప్రారంభమయ్యే అత్యంత ప్రధానమైన ఫేజ్-1 పనులను సుమారు రూ. 7 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఇందుకోసం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ కూడా ఆర్థిక సహాయం అందించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మొదటి దశ ప్రధానంగా రెండు పాయలపై కేంద్రీకృతమై ఉంటుంది. ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11 కి.మీ, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9 కి.మీ ఉన్న పరివాహక ప్రాంతాలను ఇందులో ప్రక్షాళన చేస్తారు. నదిలో మురుగునీరు చేరకుండా అడ్డుకట్ట వేయడం, పూడికతీత, నది గట్టులను పటిష్టం చేయడం, ఫ్లడ్-మిటిగేషన్ గోడల నిర్మాణం పర్యాటకుల కోసం పచ్చని పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు నిర్మించడం ఈ దశలో ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
