న్యూఢిల్లీ: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టనున్న ఆందోళనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. సీజేపీ నిర్దేశిత కాలపరిమితిలోగా అనుమతి కోసం దరఖాస్తు చేయలేదని తెలిపారు. నిబంధనల ప్రకారం జంతర్ మంతర్లో నిరసన కార్యక్రమాల కోసం కనీసం 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాల్సి ఉండగా సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ కేవలం మూడు రోజుల ముందు దరఖాస్తు సమర్పించారని వెల్లడించారు.
గతంలో కూడా సీజేపీ నిరసన మార్గదర్శకాలను పాటించడంలో విఫలమయ్యారని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల దృష్ట్యా సీజేపీ ప్రొటెస్ట్కు అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సీజేపీ ఆందోళన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా అక్టోబర్ 10న సెంట్రల్ ఢిల్లీకి అనుసంధానంగా ఉన్న మార్గాల్లోని కనీసం 57 స్టేషన్లను మూసివేయాలని పోలీసులు ఢిల్లీ మెట్రోను కూడా కోరారు.
సర్ ప్రక్రియలో అవకతవకలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ చేపట్టనున్న మూడవ నిరసన ఇది. అక్టోబర్ 3న ముంబైలో , అక్టోబర్ 8న బెంగళూరులో సీజేపీ నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగానే అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసనకు పిలుపునిచ్చింది. అయితే, సీజేపీ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో సీజేపీ నిరసన కార్యక్రమంపై ఉత్కంఠ నెలకొంది.
పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్న చెప్పిన తేదీకి నిరసన చేసి తీరుతామని సీజేపీ ఫాలోవర్స్ చెబుతున్నారు. ఇప్పటికే సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి ఢిల్లీలో వరుసగా నిరసనలు హోరెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో సీజేపీ రంగంలోకి దిగనుండటంతో అక్టోబర్ 10న దేశరాజధానిలో ఏం జరగబోతుందని ఉత్కంఠ నెలకొంది.
