న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయాలన్న మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ధర్మాసనంపై కేజ్రీవాల్, సిసోడియాలు అనుమానం వ్యక్తం చేస్తూ సీజేకు లేఖ రాశారు.
‘‘గతంలో ట్రయల్ కోర్టు మాకు క్లీన్ చిట్ ఇస్తూ ఇచ్చిన తీర్పుపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎటువంటి బలమైన కారణాలు లేకుండానే స్టే విధించారు. ఇలాంటి జోక్యం అరుదైన సందర్భాల్లోనే జరుగుతుంది.ఈ కేసులో ఈడీ పక్షం కాకపోయినప్పటికీ, పీఎంఎల్ఏ విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించడం అనుమానాలకు తావిస్తున్నది”అని లేఖలో వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నిష్పాక్షిక విచారణ కోసం కేసును మరో బెంచ్‌కు బదిలీ చేయాలని వారు కోరారు. సీజే వారి విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ప్రస్తుతం రోస్టర్ ప్రకారం ఈ కేసు సదరు న్యాయమూర్తికే కేటాయించారని స్పష్టం చేశారు. ‘‘పరిపాలనాపరమైన ఉత్తర్వుల ద్వారా ఈ పిటిషన్‌ను బదిలీ చేయడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు. విచారణ నుంచి తప్పుకోవాలా వద్దా అనేది సదరు న్యాయమూర్తే నిర్ణయించుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నట్లు రిజిస్ట్రార్ జనరల్ వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అర్వింద్ కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సీబీఐ దర్యాప్తులో లోసుగులు ఉన్నాయని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐఓ)పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ 974 పేజీలతో రివిజన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ.. ఐఓపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలపై స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఈ కేసు మరోసారి హైకోర్టులో విచారణకు రానుంది. బెంచ్ మార్పు విజ్ఞప్తిని సీజే తిరస్కరించడంతో అందరి దృష్టి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ విచారణపైనే నెలకొంది.
