ఢిల్లీని వణికించిన ధూళి తుఫాన్..ఉలిక్కిపడ్డ రాజధాని వాసులు

ఢిల్లీని వణికించిన ధూళి తుఫాన్..ఉలిక్కిపడ్డ రాజధాని వాసులు
  • 92 కిలోమీటర్ల  వేగంతో గాలిదుమారం
  • భీకర గాలులకు తోడు ఉరుములు, మెరుపులతో వర్షం
  • ఉలిక్కిపడ్డ రాజధాని వాసులు
  • రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
  • పశ్చిమ పవనాలే ​కారణమని వెల్లడి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాలను బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ గాలిదుమారం (ధూళి తుఫాను) ముంచెత్తింది. దీంతో ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్‌‌‌‌మెంట్ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. గాలిదుమారం సమయంలో ఢిల్లీ అంతటా బలమైన గాలులు వీచాయి. నగరవ్యాప్తంగా గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచగా.. మధ్యాహ్నం 2.30 గంటల టైంలో  పాలం ప్రాంతంలో అత్యధికంగా గంటకు 92 కిలోమీటర్ల (50 నాట్స్) వేగంతో ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో గంటకు 60 నుంచి70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇవి కొన్నిసార్లు గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని కూడా తాకాయి. ఈ భీకర గాలుల దాటికి తోడు నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కూడా కురిసింది.

వెస్ట్రన్ డిస్టర్బెన్సే కారణం..

ఢిల్లీలో ఇంత వేగంగా గాలిదుమారం రేగడానికి, వాతావరణం అకస్మాత్తుగా మారిపోవడానికి ప్రధాన కారణం ‘పశ్చిమ గాలులు(వెస్ట్రన్ డిస్టర్బెన్స్)’ అని అధికారులు తెలిపారు. వెస్ట్రన్ డిస్టర్బెన్స్  ప్రస్తుతం హిమాలయ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీనివల్ల వాతావరణంలో మార్పులు జరిగి ఢిల్లీలో గాలిదుమారం రేగింది. అయితే, ఈ ప్రభావం మంగళవారం నుంచి బలహీనపడుతుందని, ఆ తర్వాత ఆకాశం క్లియర్ అయి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. సోమవారం ఉదయం వేళల్లో కూడా ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసింది. వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ప్రధాన వాతావరణ కేంద్రమైన సఫ్దర్‌‌‌‌జంగ్‌‌‌‌లో కనిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీల సెల్సియస్‌‌‌‌గా నమోదైంది. ఈ ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది.