ఢిల్లీ  మేయర్ ఎన్నికలో..ఆప్​, బీజేపీ లొల్లి

ఢిల్లీ  మేయర్ ఎన్నికలో..ఆప్​, బీజేపీ లొల్లి

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​ మేయర్, డిప్యూటీ మేయర్​ను ఎన్నుకోకుండానే సభ వాయిదా పడింది. పది మంది నామినేటెడ్​ సభ్యుల ప్రమాణ స్వీకారం టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరసన తెలిపారు. దీంతో బీజేపీ, ఆప్​ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల కౌన్సిలర్లు ఒకరినొకరు తోసుకునేదాకా వెళ్లింది. ఈ నిరసనల మధ్యే నలుగురు నామినేటెడ్​ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంత చెప్పినా ఆప్​ సభ్యులు వినకపోవడంతో ప్రిసైడింగ్ ఆఫీసర్​ సత్యశర్మ (బీజేపీ) సభను గంటపాటు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తర్వాత ప్రమాణ స్వీకారం కోసం నామినేటెడ్ సభ్యుడు మనోజ్ కుమార్​ను స్టేజీపైకి పిలవగానే.. ఆప్​ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు మళ్లీ నిరసనకు దిగారు. గవర్నర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్​లోకి దూసుకెళ్లారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన సభ్యుడిని కాకుండా.. వేరొక సభ్యుడిని ప్రిసైడింగ్ స్పీకర్‌గా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నియమించారంటూ ఆప్​ కౌన్సిలర్లు మండిపడ్డారు. ముందుగా తమ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించాలంటూ టేబుల్స్​పై నిలబడి నిరసన తెలిపారు.

బీజేపీవి నీచ రాజకీయాలు: ఆప్

నామినేటెడ్​ సభ్యులు ఎన్నడూ ఢిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​ హౌస్​లో ఓటేయలేదని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. స్టాండింగ్​ కమిటీ సభ్యులను కూడా ఓటింగ్​కు అనుమతించలేదంటూ మండిపడ్డారు. హౌస్​లో తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ నీచ రాజకీయాలకు దిగుతున్నదని విమర్శించారు. సభలో ఆప్ కౌన్సిలర్లు గందరగోళం సృష్టిస్తున్నారంటూ బీజేపీ ఎంపీ మనోజ్​ తివారీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికలంటే ఆప్​ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఇక బీజేపీ కౌన్సిలర్లు ఆప్​తో పాటు పార్టీ కన్వీనర్ అరవింద్​ కేజ్రీవాల్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ప్రిసైడింగ్ ఆఫీసర్​ సత్యశర్మ మేయర్, డిప్యూటీ మేయర్​ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో మరో తేదీని ప్రకటించి మిగిలిన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాక మేయర్, డిప్యూటీ మేయర్​ను ఎన్నుకుంటామని తెలిపారు.

మా మహిళా కౌన్సిలర్లపై దాడి చేసిన్రు: బీజేపీ ఎంపీలు

బీజేపీ మహిళా కౌన్సిలర్లపై ఆప్ మేల్ కౌన్సిలర్లు దాడి చేశారని పార్టీ ఎంపీలు మీనాక్షి లేఖి, మనోజ్ తివారి, పర్వేశ్ వర్మలు ఆరోపించారు. వీరంతా కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ దాడిలో ఏడుగురు బీజేపీ కౌన్సిలర్లకు గాయాలయ్యాయన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే మేయర్, డిప్యూటీ మేయర్​ ఎన్నికను ఆప్​ కౌన్సిలర్లు అడ్డుకున్నారని విమర్శించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రొసీడింగ్స్ ప్రారంభించగానే ఆప్ నేతలు గొడవ షురూ చేశారని తెలిపారు. బీజేపీ కౌన్సిలర్లు ఇందర్​ కౌర్, అనితతో ఆప్​ కౌన్సిలర్లు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌర్​ జుట్టు పట్టుకొని లాగారని, పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆమె వేలికి గాయమైందని తెలిపారు. అనితకు కూడా గాయం కావడంతో కౌర్ ఆమెను సేవ్​ చేసిందన్నారు. కొందరు ఆప్​ కౌన్సిలర్లు లిక్కర్ తాగి వచ్చారని ఆరోపించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్​ చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఎంసీడీ సభలో ఇదొ బ్లాక్ డే అని విమర్శించారు. ట్రీట్​మెంట్ తీసుకుంటున్న బీజేపీ మహిళా కౌన్సిలర్లను ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్​దేవ్​ పరామర్శించారు. ఆప్​ కౌన్సిలర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.