ఢిల్లీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువని అందరికీ తెలుసు. దీనికి తగ్గట్టే దేశ రాజధాని మధ్యలో ఉన్న కన్నాట్ ప్రాంతం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కమర్షియల్ ఆఫీస్ ప్రాంతాల్లో 9వ స్థానంలో నిలిచింది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సీబీఆర్‌ఈ సర్వే చేసి ఈ విషయం వెల్లడించింది. ఖరీదైన ఆఫీసు ప్రాంతాల జాబితాను ఈ మధ్యే విడుదల చేసింది. కన్నాట్‌లో ఓ చదరపు అడుగుకు ఏడాదికి సుమారు రూ.10 వేలు కట్టాల్సి వస్తోందని తెలిపింది. లిస్టులో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారీమన్ పాయింట్ 27, 40వ స్థానాల్లో ఉన్నాయి.
కన్నాడ్ గతేడాది కూడా 9వ స్థానాన్నే దక్కించుకోగా బీకేసీ, నారీమన్ పాయింట్ 26, 37వ స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం బీకేసీలో ఏడాదికి ఓ చదరపు అడుగుకు రూ.6 వేలు, నారీమన్ పాయింట్‌లో రూ.4,500 కట్టాల్సి వస్తోందని సీబీఆర్‌ఈ తెలిపింది. హాంకాంగ్‌లోని సెంట్రల్ డిస్ట్రిక్ వరుసగా రెండో ఏడాదీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక్కడ ఒక్క చదరపు అడుగుకు రూ.22 వేలు కట్టాల్సి వస్తోందని సీబీఆర్‌ఈ తెలిపింది. జాబితాలో లండన్‌లోని వెస్ట్ సైడ్ రెండో స్థానంలో, హాంకాంగ్‌లోని కౌలూన్ మూడు, న్యూయార్క్‌లోని మిడ్ టౌన్, మాన్‌హట్టాన్ నాలుగు, బీజింగ్ ఐదో ప్లేస్‌లో నిలిచాయి. ఢిల్లీ ప్రధాన మార్కెట్ కావడంతో ప్రపంచంలోని ఖరీదైన ప్రాంతాల్లో తొలి 10 ప్లేస్‌లలో నిలుస్తూనే ఉందని ఓ సీబీఆర్‌ఈ అధికారి తెలిపారు.
