ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు క్లీన్ చిట్ ..23 మంది నిర్దోషులేనని తేల్చిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు క్లీన్ చిట్ ..23 మంది నిర్దోషులేనని తేల్చిన కోర్టు
  • ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, సిసోడియాసహా మరో 20 మందికి ఊరట
  • నిందితులందరూ నిర్దోషులేనని తేల్చిన సీబీఐ స్పెషల్​ కోర్టు
  • మొత్తం 598 పేజీల తీర్పును వెలువరించిన జడ్జి జితేంద్రసింగ్
  • సీబీఐ అధికారులు లోపభూయిష్టంగా దర్యాప్తు చేశారని వెల్లడి
  • ‘పుకార్లే ఆధారాలు, నమ్మదగని అప్రూవర్లు’ అంటూ కీలక కామెంట్స్​
  • ‘సౌత్ గ్రూప్’ అంటూ వ్యాఖ్యానించడంపై మందలించిన ధర్మాసనం 
  • లిక్కర్ స్కాంలో సీబీఐ ఆరోపణలు కొట్టివేస్తూ 23 మంది పేర్లు డిశ్చార్జ్
  • సీబీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జడ్జి​ ఆదేశాలు
  • స్పెషల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సీబీఐ

న్యూఢిల్లీ, వెలుగు:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు (రౌస్ ఎవెన్యూ కోర్టు) కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తోసిపుచ్చుతూ.. జాగృతి అధ్యక్షురాలు కె కవిత(ఏ 17)కు క్లీన్ చిట్ ఇచ్చింది. అలాగే  ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిసోడియాతో సహా మరో 21(ఏ1 నుంచి ఏ23 వరకు) మందిపై దాఖలైన అభియోగాలను కోర్టు కొట్టివేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం సీబీఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి (పీసీ యాక్ట్) జితేంద్ర సింగ్ 598 పేజీలతో వివరణాత్మక తీర్పును వెలువరించారు. సీబీఐ దర్యాప్తులో విధానపరమైన లోపాలు, రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన, పుకార్లపై ఆధారపడడంలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. 


అందువల్ల నిందితులపై దాఖలైన కేసులు కొట్టివేస్తూ.. వారి పేర్లను ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. సరైన ఆధారాలు లేకుండానే వీరి పేర్లను కేసులో చేర్చారంటూ సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తు పూర్తి లోపభూయిష్టంగా జరిగిందన్న న్యాయమూర్తి, నిందితులపై మోపిన అభియోగాలను నిరూపించడంలో సీబీఐ  విఫలమైందని స్పష్టం చేశారు.

దర్యాప్తులో అనేక లొసుగులు 

దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నాయని, వందలాది పేజీలతో చార్జ్‌‌‌‌షీట్ తయారు చేసినా ఒక్క సాక్షి ప్రకటనను కూడా కచ్చితంగా చేర్చలేకపోయారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి నిర్దిష్ట సమాచారం, ప్రాథమిక ఆధారాలు  లేకుండా కేజ్రీవాల్, సిసోడియా, కవితతోపాటు ఇతరులను నిందితులుగా చేర్చుతూ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌తో తప్పుదోవ పట్టించారని స్పెషల్ జడ్జి స్పష్టం చేశారు. ఏ1 గా నిందితుడు కుల్‌‌‌‌దీప్‌‌‌‌సింగ్‌‌‌‌ను ఎందుకు చేర్చారో సీబీఐ చెప్పలేకపోయిందన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు సేకరించకపోవడం ఆశ్చర్యకరమని జడ్జి వ్యాఖ్యానించారు. లిక్కర్ విధానాన్ని మనీశ్‌‌‌‌ సిసోడియా రూపొందించారని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు చూపలేదని పేర్కొన్నారు. చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌లో ఎన్నో అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయని, దానివల్ల మద్యం కుంభకోణం విషయంలో కుట్ర జరిగినట్టు సీబీఐ తేల్చలేకపోయిందని జడ్జి స్పష్టంచేశారు. ‘‘ఒక రాజ్యాంగబద్ధ పదవి నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌‌‌‌లాంటి వ్యక్తిని నిర్దిష్ట సమాచారం లేకుండా కేసులో నిందితుడిగా చేర్చడం రూల్ ఆఫ్ లాకే విరుద్ధం. ఏ ఒక్కరూ కేజ్రీవాల్‌‌‌‌కు వ్యతిరేకంగా ప్రకటన చేయడం కానీ, సాక్ష్యాలు సమర్పించడం కానీ చేయనప్పుడు, ఆయనే ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఎలా చెప్పగలరు?’ అని ప్రశ్నించారు. అసలు ఇలాంటి కేసును అల్లినందుకు సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద శాఖాపరమైన విచారణ జరపాలని అన్నారు.

లెఫ్ట్‌‌‌‌నెంట్ గవర్నరే ఆమోద ముద్ర వేశారు..

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డైరెక్టర్ ప్రవీణ్ రాయ్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ 2022 నవంబర్ 24న  ప్రధాన చార్జ్‌‌‌‌షీట్ దాఖలు చేసింది.  ఎక్సైజ్ శాఖకు చెందిన కొందరు అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, మద్యం వ్యాపారులతో కలిసి కుమ్మక్కై ఢిల్లీ మద్యం పాలసీ తెచ్చారని, ఆయా వ్యాపారులతోపాటు తమకు కూడా లబ్ధి చేకూర్చేందుకు ఈ విధానాన్ని రూపకల్పన చేశారన్నది ప్రధాన అభియోగం. కానీ మద్యం విధానం రూపకల్పనలో అలాంటి అక్రమాలేవీ జరిగినట్టు ఆధారాల్లేవని కోర్టు స్పష్టంచేసింది.  ‘వివిధ శాఖలు, నిపుణుల కమిటీలతో చర్చించి కేబినెట్ స్థాయిలో ఆమోదాలు పొందిన తర్వాతే నిర్మాణాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నారు.  లెఫ్టినెంట్ గవర్నరే ఈ విధానానికి ఆమోదముద్ర వేశారు. ఈ అంశాన్ని సీబీఐ ఎలా మరిచిపోయింది. విధానాన్ని తప్పుపట్టినంత మాత్రాన సరిపోదు. కేసులో ఉన్న వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార దుర్వినియోగానికి రుజువులు చూపాలి. సాక్ష్యాధారాలు సమర్పించనంత వరకు ఎలాంటి ఆరోపణలకు పస ఉండదు” అని కోర్టు స్పష్టం చేసింది.  

మాగుంట వాంగ్మూలంతో కేజ్రీవాల్‌‌‌‌ను ఇరికించారు.. 

కేజ్రీవాల్‌‌‌‌ను నాలుగో సప్లిమెంటరీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌లో 2024 జులైన ఆఖరి దశలో నిందితుడిగా చేర్చడాన్ని కోర్టు తప్పుపట్టింది. మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్రూవర్‌‌‌‌‌‌‌‌గా ఇచ్చిన ప్రకటన ఆధారంగా కేజ్రీవాల్‌‌‌‌ను కుట్రలో భాగం చేశారని తెలిపింది.  ‘‘కేసీఆర్ కూతురు తనను సంప్రదిస్తారని మాగుంట చెప్పిన వాంగ్మూలం ఆధారంగానే కేజ్రీవాల్‌‌‌‌ను ఇరికించారు. ఆ తర్వాతే ఆయన్ని ఏ 18 నిందితుడిగా చేర్చారు. అప్రూవర్ గా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్‌‌‌‌ను ఎలా ఇరికిస్తారు?’ అని  కోర్టు ప్రశ్నించింది. సౌత్ గ్రూప్ కు ప్రయోజనాలు చేకూర్చేందుకే విధానాన్ని మార్చడంలో కేజ్రీవాల్ కీలకపాత్ర పోషించారని చెప్పేందుకు సీబీఐ తీవ్ర ప్రయత్నాలు చేసిందని కోర్టు అభిప్రాయపడింది. గోవా ఎన్నికల్లో నిధుల కోసమే కేజ్రీవాల్ ఈ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పేందుకు ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసింది. అప్రూవర్ల ప్రకటనలు నమ్మదగినవి కాదని, వాటిని నిర్ధారించుకోలేమని కోర్టు అభిప్రాయపడింది. రాఘవ్, మాగుంటలాంటి వారి ప్రకటనలను పరిగణనలోకి తీసుకోలేమని, వాటికి డాక్యుమెంటరీ సాక్ష్యాలేమీ లేవని తెలిపింది. అక్కడా ఇక్కడ విన్న మాటలను ఆధారంగా కేసును నిర్మించారంటూ సీబీఐని తీవ్రంగా తప్పుపట్టింది. మాగుంట గ్రూప్‌‌‌‌కు చెందిన జనబ్ ప్రైవేట్ లిమిటెడ్, కేజీఆర్ఎల్ కంపెనీకి రూ.25 కోట్లు బదిలీ చేయడం.. తర్వాత దానిని తిరిగి చెల్లించడం చూస్తే ఎలాంటి కుట్రకు ఆస్కారం లేదని తెలిపింది. రుణాన్ని తిరిగి చెల్లించినంత మాత్రాన దానిని సాక్ష్యంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. 

మార్జిన్ పెంచినంత మాత్రాన కుట్ర అనలేం 

హోల్‌‌‌‌సెల్ డీలర్ల మార్జిన్‌‌‌‌ను 12 శాతం మేరకు పెంచినంత మాత్రాన దాన్ని కుట్రగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ 12 శాతం మార్జిన్ ఆర్థికంగా లాభసాటి కూడా కాదని కోర్టు అభిప్రాయపడింది. సౌత్ గ్రూప్‌‌‌‌కు లబ్ధి చేకూర్చేందుకు ఈ మార్జిన్‌‌‌‌ను పెంచారని, విధానాన్ని రూపొందించారని ఆరోపించడం హేతుబద్ధంగా సరైనది కాదని కోర్టు స్పష్టం చేసింది. పాత, కొత్త విధానాలను పోల్చి విశ్లేషించడంలో కూడా సీబీఐ విఫలమైందని కోర్టు తప్పుపట్టింది.  కాగా, ఊహాగానాల ఆధారంగా సీబీఐ కేసును నిర్మించిందని, అది న్యాయపరంగా అంగీకారయోగ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. ముందుగా ఒక నిర్ధారణకు వచ్చి వాస్తవాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసిందని తెలిపింది. ఆర్థిక విధానాల విషయంలో సీబీఐ నిరక్ష్యరాస్యురాలిగా వ్యవహరించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ దృష్టికి వచ్చిన ప్రతి మొత్తాన్ని నేరంలో పాత్రగా చిత్రించేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా సాధారణ ఆర్థిక లావాదేవీలను కూడా నేరపూరితంగా చిత్రించేందుకు సీబీఐ ప్రయత్నించిందని నిందించింది. ఎన్నికల కమిషన్ నిర్వహించిన పాత్రను కూడా సీబీఐ చేపట్టి ఎన్నికల ప్రచారంలో చేసిన ఖర్చులను ఆడిట్ చేసే ప్రయత్నం చేసిందని విమర్శించింది.

అన్యాయం ఎక్కడ జరిగినా న్యాయానికి ముప్పే

ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి కుట్ర, నేరపూరిత ఉద్దేశం లేదని కోర్టు తీర్పునిచ్చింది. కేవలం ఊహాగానాల ఆధారంగా కుట్ర కథానాన్ని నిర్మించడానికి సీబీఐ ప్రయత్నించినందున ప్రాసిక్యూషన్ కేసు న్యాయ పరిశీలనలో మనుగడ సాగించలేదని కోర్టు వెల్లడించింది. అందువల్ల 23 మంది నిందితుల్లో ఎవరిపైనా ప్రాథమికంగా ఎలాంటి కేసు నిరూపితం కాలేదని తేల్చి చెప్పింది. అదే సందర్భంలో అప్రూవర్ల స్టేట్‌‌‌‌మెంట్ల ఆధారంగా చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌లను రూపొందించినందుకు సీబీఐని మందలించింది. ‘‘నిందితుడికి క్షమాపణ కలిగిస్తూ, అప్రూవర్ మార్చి... దర్యాప్తు/కథనాల్లో పురోగతి, అదనపు వ్యక్తులను నిందితులుగా మార్చేడానికి ఉపయోగించే వాంగ్మూలాలు తప్పు. అలాంటి విధానాలు అనుమతిస్తే, అది రాజ్యాంగ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది’’ అని స్పెషల్ జడ్జి పేర్కొన్నారు. అప్రూవర్లు చెప్పిన మాటలనే సీబీఐ పరమ సత్యాలుగా నమ్మిందని, వాటిని కనీసం వెరిఫై కూడా చేసుకోలేదని గుర్తుచేసింది. డబ్బు మార్పిడి జరగడానికి.. మనీశ్‌‌‌‌ సిసోడియాకు మధ్య సంబంధం ఉన్నట్లు రుజువు చేయలేకపోయారని  స్పష్టం చేశారు. సౌత్ గ్రూప్ తరఫున విజయ్ నాయర్ (ఏ 3) మనీశ్‌‌‌‌ సిసోడియాతో కుమ్మక్కై కుట్రకు పాల్పడ్డారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. ఇండో స్పిరిట్స్‌‌‌‌కు చెందిన సమీర్ మహేంద్రు(ఏ 7) ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన అమలులో కుట్రకు పాల్పడ్డారని, తద్వారా హోల్‌‌‌‌సెల్ లైసెన్సు పొందారని చెప్పేందుకు కూడా సాక్ష్యాలు లభించలేదని తెలిపింది. అన్యాయం ఎక్కడ జరిగినా న్యాయానికి ప్రతిచోట ముప్పు ఏర్పడినట్లేనని మార్టిన్ లూథర్ కింగ్ మాటలను ఉటంకించారు. 

‘నార్త్ గ్రూప్’ ప్రస్తావన ఎందుకు తేలే?

ఈ కేసులో కొందరు నిందితులను ప్రత్యేకంగా చూపేందుకు ‘సౌత్ గ్రూప్’ అనే పదాన్ని వాడడంపై సీబీఐని రౌస్ ఎవెన్యూ కోర్టు మందలించింది. ఈ కేసులో కవితతో పాటు దక్షిణాది ప్రాంతాలకు చెందిన నిందితులను కోట్ చేస్తూ సీబీఐ ‘సౌత్ గ్రూప్’అని చార్జ్‌‌‌‌షీట్ లో ప్రస్తావించింది. ఈ అంశంపై కోర్టు స్పందిస్తూ....‘‘నిందితుల ప్రాంతీయత, నివాస స్థలం ఆధారంగా నిందితుల గ్రూప్‌‌‌‌ను వర్ణించడం సరికాదు. ఇలాంటి పేర్లు పెట్టడానికి చట్టం అనుమతించదు. భౌగోళికంగా నిర్వహించబడిన లేబుల్‌‌‌‌ను ఎంపిక చేసుకోవడం ఏకపక్షం, అనవసరం. మరి మిగిలిన నిందితులకు ‘నార్త్ గ్రూప్’లాంటి పదాన్ని ఎందుకు ఏజెన్సీ ఉపయోగించలేదు’’ అని ప్రశ్నించింది. రాజ్యాంగ క్రమంలో చట్టం ముందు సమానత్వం, దేశ ఐక్యత, సమగ్రత కీలకమని పేర్కొన్నారు. ప్రాంతీయ గుర్తింపుతో కూడిన వివరణలు, చట్టబద్ధమైన దర్యాప్తు లేదా ప్రాసిక్యూషనల్ ప్రయోజనానికి ఏమాత్రం దోహదపడవని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన ‘యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ కాబ్రెరా’ కేసులోని అంశాలను స్పెషల్ జడ్జి ప్రస్తావించారు. ఇకపై చార్జ్‌‌‌‌షీట్, దర్యాప్తు కథనాలు తయారు చేసేటప్పుడు భాష ఎంపికలో మరింత జాగ్రత్త, సంయమనం అవరసమని సీబీఐని హెచ్చరించారు. 

క్లీన్ చిట్ వచ్చింది వీళ్లకే...ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ దాఖలు 

చేసిన కేసులో 23 మందికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇందులో ఏ1 నుంచి వరుసగా.. కుల్దీప్‌‌‌‌ సింగ్, నరేంద్ర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రు, మనీశ్‌‌‌‌ సిసోడియా, అమన్‌‌‌‌దీప్ సింగ్ ధాల్, అర్జున్ పాండే, బుచ్చిబాబు గోరంట్ల, రాజేశ్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చన్ ప్రీత్ సింగ్ రాయల్, కల్వకుంట్ల కవిత, అర్వింద్‌‌‌‌ కేజ్రీవాల్, దుర్గేశ్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, అశిశ్ చంద్ మాతూర్, శరత్ చంద్రా రెడ్డి ఉన్నారు.

సీబీఐ ఐఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోండి 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్(ఐఓ)పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ప్రధానంగా ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగి కుల్దీప్ సింగ్‌‌‌‌ను (ఎక్సైజ్ శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్) ఏ1 గా చేర్చడంపై ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘‘ప్రి-మెడిటేషన్, కొరియోగ్రఫీగా ఈ కేసు విచారించారు. ప్రభుత్వ ఉద్యోగిపై వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు సాగలేదు. ముందుగా ఊహించిన కథనానికి సరిపోయేలా ఆధారాలు రూపొందించారు’’ అని ధర్మాసనం తీర్పులో ప్రస్తావించింది. మాజీ ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఆనంద్ కుమార్ తివారీని అనుమానితులుగా జాబితాలో చూపుతూ.. అలాగే వారిని ప్రాసిక్యూషన్ సాక్షులుగా చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌లో పేర్కొనడంపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇదంతా తన కథనానికి తగ్గట్టుగా ఐఓ ఉద్దేశపూర్వకంగా అల్లిన కట్టుకథగా అభివర్ణించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విశ్వసనీయతను కాపాడేందుకు, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి తప్పు చేసిన సీబీఐ అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నట్టు స్పష్టం చేసింది. 


‘‘ఎలాంటి నిర్దిష్ట సమాచారం, ప్రాథమిక ఆధారాలు  లేకుండానే కేజ్రీవాల్, సిసోడియా, కవితతోపాటు ఇతరులను నిందితులుగా సీబీఐ చేర్చింది..  కేవలం ఊహాగానాల ఆధారంగా నిర్మించిన ఈ కేసు  న్యాయపరంగా అంగీకారయోగ్యం కాదు.’’

‘‘ఒక రాజ్యాంగబద్ధ పదవి నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి వ్యక్తిని నిర్దిష్ట సమాచారం లేకుండా కేసులో నిందితుడిగా చేర్చడం రూల్ ఆఫ్ లాకే విరుద్ధం. ఏ ఒక్కరూ కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా ప్రకటన చేయడం కానీ, సాక్ష్యాలు సమర్పించడం కానీ చేయనప్పుడు, ఆయనే ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఎలా చెప్పగలరు?’’
- సీబీఐ స్పెషల్ కోర్టు