ఇరాన్ ప్రభుత్వం బిటా హెమ్మతి అనే మహిళకు మరణశిక్ష విధించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బిటా హెమ్మతి ఇరాన్‌కు చెందిన ఒక సామాన్య మహిళ. 2025 జనవరిలో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన భారీ నిరసనల్లో పాల్గొన్నందుకు ఆమెకు అక్కడి కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ నిరసనల కారణంగా మరణశిక్ష పడిన మొదటి మహిళా నిరసనకారి ఈమె కావడం గమనార్హం.
వివరాల ప్రకారం.. ఏం జరిగిందంటే.. ఇరాన్ ప్రభుత్వం, అక్కడి న్యాయవ్యవస్థ ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశాయి. నిరసనల సమయంలో భద్రతా దళాలపై దాడులు చేశారని, పైకప్పుల నుంచి రాళ్లు, సీసాలు, నిప్పు అంటించి విసిరారని ఆమెపై అభియోగాలు మోపారు. అంతేకాకుండా పేలుడు పదార్థాలు, ఆయుధాలు వాడి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారని అధికారులు చెబుతున్నారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ప్రవర్తించారని, శత్రువులతో చేతులు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేక ప్రచారం చేశారని ఆమె పై కేసు నమోదు చేశారు.
బిటా హెమ్మతితో పాటు ఆమె భర్త మొహమ్మద్రెజా మజీద్ అస్ల్, కౌరోష్, బెహ్రూజ్ అనే మరో ఇద్దరికి కూడా మరణశిక్షలు పడ్డాయి. వీరి ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అలాగే వీరి బంధువు అమీర్ హెమ్మతికి ఆరేళ్ల జైలు శిక్ష విధించారు.
ALSO READ : తెలంగాణ నుంచి గల్ఫ్ వలసల్లో ఎస్సీలు, బీసీలే ఎక్కువ
డిసెంబర్ 2025లో టెహ్రాన్‌లోని మార్కెట్ వ్యాపారులు, దుకాణదారులు సమ్మె ప్రారంభించారు. ఈ సమ్మె మెల్లిమెల్లిగా దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. దింతో విద్యార్థులు, సామాన్య ప్రజలు సహా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ నిరసనలను అణచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది. దింతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల వేల సంఖ్యలో ప్రజలను అరెస్టు చేశారు.
ముఖ్యంగా 2024తో పోలిస్తే 2025లో ఇరాన్‌లో మరణశిక్షల శాతం 68% పెరిగింది. గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే కనీసం 1,639 మందికి ఉరిశిక్ష అమలు చేయగా, అందులో 48 మంది మహిళలు ఉన్నారు. మొత్తానికి, బిటా హెమ్మతి కేసు ఇరాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు అలాగే నిరసనకారులపై ప్రభుత్వం చూపిస్తున్న కఠినత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.

