తెలంగాణలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉదయం 9 గంటల నుండే ఎండల తీవ్రత మొదలవుతుండటంతో.. జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. కేవలం ఎండ మాత్రమే కాదు.. నిప్పులు కురిపిస్తున్న వేడి గాలులు తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్కును దాటేస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన వాతావరణ శాఖ.. తెలంగాణలోని20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం నుంచి మొదలుకొని హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్ వరకు దాదాపు అన్ని జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
►ALSO READ | తెలంగాణలో ఏ కులం లేనివాళ్లు (నో కాస్ట్) 12 లక్షల మంది
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ వేడిమి అత్యధికంగా ఉంటుంది. ఈ సమయంలో బయటకు వెళ్తే వడదెబ్బ (Sunstroke) తగిలే ప్రమాదం ఉంది కాబట్టి, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే, నిప్పులు కురిసే ఎండల నుండి త్వరలోనే ఉపశమనం లభించనుంది. ఈ నెల 19వ తేదీ నుండి ఎండలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. 19 నుండి 22వ తేదీ వరకు రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఆకాశంలో ఏర్పడే క్యూమిలో నింబస్ మేఘాల కారణంగా అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వడగళ్ల వానలు పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద ఉండవద్దని అధికారులు కోరుతున్నారు.

