కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ నంబర్​ 1

కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ నంబర్​ 1
  •  కాలుష్యకారక సిటీల్లో నంబర్​ వన్​ రాజస్థాన్​లోని భివాడీ
  • టాప్​ 15లో 10.. టాప్​ 100లో 63 సిటీలు మనవే
  • స్విట్జర్లాండ్​కు చెందిన ఐక్యూఎయిర్​ స్టడీలో వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకారక రాజధానిగా ఢిల్లీ అతిచెత్త రికార్డును మూటగట్టుకుంది. 2021కి సంబంధించి 117 దేశాల్లోని 6,475 సిటీలపై స్విట్జర్లాండ్​కు చెందిన ఐక్యూఎయిర్​ అనే సంస్థ కాలుష్యంపై స్టడీ చేసింది. ఆ నివేదికను మంగళవారం విడుదల చేసింది. కాలుష్యం ఎక్కువగా నమోదవుతున్న  సిటీల జాబితాలో రాజస్థాన్​లోని భివాడీ, యూపీ సిటీ ఘజియాబాద్​లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. కాలుష్యం ఎక్కువగా నమోదవుతున్న టాప్​ 15 సిటీల్లో 10, టాప్​ 100లో 63 సిటీలు మన దేశం నుంచే ఉన్నట్టు రిపోర్ట్​ వెల్లడించింది. మన దేశంలోని ఏ ఒక్క సిటీ కూడా డబ్ల్యూహెచ్​వో పెట్టిన స్టాండర్డ్​కు తగ్గట్టుగా లేవని పేర్కొంది. దేశంలోని 48 శాతం సిటీల్లో పీఎం 2.5 స్థాయులు క్యూబిక్​ మీటరుకు 58.1 మైక్రోగ్రామ్​లుగా ఉందని, డబ్ల్యూహెచ్​వో పెట్టిన 5 మైక్రోగ్రాముల లిమిట్​ కన్నా పది రెట్లు ఎక్కువగా కాలుష్యం నమోదవుతోందని తెలిపింది. ఢిల్లీలో కాలుష్యకారక పీఎం 2.5 స్థాయి 2021లో 14.6 శాతం పెరిగిందని, క్యూబిక్​ మీటరుకు 96.4  మైక్రోగ్రాముల మేర పీఎం 2.5 ఉంటోందని వెల్లడించింది. అంతకుముందు ఏడాదిలో 84 మైక్రోగ్రాములుగా ఉండేదని పేర్కొంది. కాగా, కాలుష్యకారక రాజధానుల జాబితాలో ఢిల్లీ తర్వాత బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఛాడ్​ క్యాపిటల్​ నజమీనా, తజికిస్థాన్​ రాజధాని దుషాంబి, ఒమన్​ రాజధాని మస్కట్​లు నిలిచాయి. 

టాప్​15​ పొల్యూటెడ్​ సిటీలు

భివాడీ (రాజస్థాన్​), ఘజియాబాద్​(యూపీ), హోటాన్​ (చైనా), ఢిల్లీ, జౌన్​పూర్​ (యూపీ), ఫైసలాబాద్​ (పాకిస్తాన్​), నోయిడా (యూపీ), బహవల్పూర్​ (పాకిస్తాన్​), పెషావర్​ (పాకిస్తాన్​), బాగ్పట్​ (యూపీ), హిసార్​ (హర్యానా), ఫరీదాబాద్​(హర్యానా), గ్రేటర్​ నోయిడా (యూపీ), రోహ్​టక్​ (హర్యానా), 
లాహోర్​ (పాకిస్తాన్​)

అన్ని దేశాల్లోనూ అంతే

ప్రపంచంలోని ఏ దేశమూ కాలుష్యంపై డబ్ల్యూహెచ్​వో నిర్దేశించిన ప్రమాణాలను అందుకోలేదని స్టడీ తేల్చింది. కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల లిస్ట్​లో బంగ్లాదేశ్​ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో ఛాడ్​ ఉంది. చైనాలో కూడా ఇప్పుడు పరిస్థితి దిగజారిందని రిపోర్ట్​ వెల్లడించింది. గాలి నాణ్యత విషయంలో చైనా 14వ స్థానం నుంచి 22వ ర్యాంకుకు పడిపోయినట్టు తెలిపింది. కాగా, స్టడీ చేసిన 6,475 సిటీల్లో కేవలం 3.4 శాతం నగరాలే ఆ డబ్ల్యూహెచ్​వో ప్రమాణాలకు 
తగ్గట్టున్నాయని చెప్పింది.