సిరిసిల్ల జోన్ వద్దే వద్దు! .. మెదక్ జిల్లాను చార్మినార్​లో కలపాలని డిమాండ్

సిరిసిల్ల జోన్ వద్దే వద్దు! .. మెదక్ జిల్లాను చార్మినార్​లో కలపాలని డిమాండ్
  • జేఏసీ ఆధ్వర్యంలో మళ్లీ మొదలైన ఉద్యమం
  • అన్ని మండలాల తహసీల్దార్లు, ఆర్డీఓలకు వినతులు
  • మొన్నటి దాకా తొక్కిపెట్టిన బీఆర్ఎస్ ​ప్రభుత్వం
  • కాంగ్రెస్​ ప్రభుత్వమైనా స్పందించి మార్చాలని విజ్ఞప్తులు 

మెదక్, వెలుగు : మెదక్​ జిల్లాను చార్మినార్​జోన్ లో కలపాలనే డిమాండ్​మళ్లీ తెరపైకి వచ్చింది. రాజధాని హైదరాబాద్​ను ఆనుకొని ఉన్న జిల్లాను తీసుకెళ్లి రాజన్న సిరిసిల్ల జోన్ లో కలిపేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆ జిల్లా వాసులు వాపోతున్నారు. విద్య, ఉద్యోగ, ప్రమోషన్ల విషయంలో తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి దాకా బీఆర్ఎస్​ ప్రభుత్వం తమ డిమాండ్​ను తొక్కిపెట్టిందని, కాంగ్రెస్​ప్రభుత్వమైనా స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇప్పటికే ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత జేఏసీగా ఏర్పడి పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో భాగంగా మండలాల తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు త్వరలోనే ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి మెదక్​ జిల్లా గతంలో హైదరాబాద్ జోన్​లోనే ఉండేది. గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం జిల్లాల పునర్​వ్యవస్థీకరణలో భాగంగా జోన్లను మార్చింది. కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాను చార్మినార్ (హైదరాబాద్)​ జోన్​కిందే ఉంచి, మెదక్, సిద్దిపేట జిల్లాలను రాజన్న సిరిసిల్ల జోన్​లో కలిపింది. హైదరాబాద్​ను ఆనుకొని ఉన్న జిల్లాను ఎక్కడో ఉన్న సిరిసిల్లలో కలపడాన్ని మెదక్​ జిల్లాకు చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులు, స్టూడెంట్లు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. 

తీవ్రమైన పోటీ

చుట్టుపక్కల ఉన్న జిల్లాల కన్నా మెదక్  జిల్లా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. ఇక్కడి మెజారిటీ ప్రజల జీవనాధారం వ్యవసాయమే. పక్కనే ఉన్న సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలతో పోలిస్తే విద్య, పారిశ్రామికంగా వెనుకంజలో ఉంది. ఏటా విడుదలయ్యే పది, ఇంటర్  ఫలితాల్లో మెదక్  జిల్లా చివరి స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. అలాగే సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలతో పోలిస్తే మెదక్​ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు.

మెదక్​ జిల్లాలో డిగ్రీ పూర్తి చేసిన స్టూడెంట్లు పీజీ కోర్సులు చదివేందుకు హైదరాబాద్  ఉస్మానియా యూనివర్సిటీ అనుకూలంగా ఉంటుంది. అయితే, మెదక్​జిల్లా సిరిసిల్ల జోన్​లో ఉండడంతో ఉన్నత చదువుల కోసం కరీంనగర్  జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీకి వెళ్లాల్సి వస్తోంది. అక్కడి దాకా వెళ్లి చదువుకోవాలంటే ఖర్చులు పెరుగుతున్నాయి. సిరిసిల్ల జోన్​లోనే ఉంటే విద్య, ఆర్థికపరంగా మెదక్   విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎంతో నష్టం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విద్యాపరంగా ముందుంటున్న కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల వాసులకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. మెదక్​జిల్లా వాసులు వెనుకబడిపోతున్నారు. జిల్లాకు చెందిన నిరుద్యోగులు గెజిటెడ్  స్థాయి ఉద్యోగాలు సాధించడం కలగానే మిగులుతోంది. గ్రేడ్–4 స్థాయి ఉద్యోగాలకే పరిమితం అయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ గెజిటెడ్ స్థాయి ఉద్యోగం సాధించినా, దగ్గరగా ఉన్న  జిల్లాల్లో కాకుండా ఎంతో దూరంలో ఉన్న జిల్లాల్లో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రేవంత్​ రెడ్డి హామీ

అసెంబ్లీ ఎన్నికల టైంలో మెదక్​ జిల్లాను చార్మినార్​జోన్ లోకి మార్చాలన్న డిమాండ్  తెరపైకి వచ్చింది. ప్రధానంగా నర్సాపూర్​ ప్రాంత  వాసులు జోన్​ను మార్చాలని కోరుతున్నారు. నర్సాపూర్ ​రోడ్ షోలో మాజీ మంత్రి కేటీఆర్​ తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే జోన్​ మారుస్తామన్నారు. నర్సాపూ ర్​బహిరంగ సభలో అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డి జోన్​ మార్పు విషయాన్ని పరిశీలించి, న్యాయం జరిగేలా చూస్తామని ప్రకటించారు. కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీని సీఎం  నిలబెట్టుకోవాలని మెదక్  జిల్లా వాసులు కోరుతున్నారు.  

అన్నింట్లోనూ అన్యాయమే 

మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్​లో చేర్చడంతో ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్ల విషయంలో తీరని అన్యాయం జరుగుతోంది. గెజిటెడ్ హెడ్ మాస్టర్  ప్రమోషన్లలో మెదక్  జిల్లాలో120కి పైగా వేకెన్సీలు ఉండగా, స్థానిక స్కూల్  అసిస్టెంట్లలో 30 మందికి మాత్రమే చోటు దక్కింది. మల్టీ జోన్  సిస్టమ్ తో ఎంతో మంది నష్టపోయారు. అలాగే 317 జీఓతో స్కూల్ అసిస్టెంట్, ఎస్​జీటీ పోస్టులు ఇతర జిల్లాల వారితో నింపారు. పక్కనే హైదరాబాద్  జోన్ ఉన్నా నాన్ లోకల్  కారణంగా చాన్స్​ లేకుండా పోతోంది.

 ప్రసన్న కుమార్, టీచర్, నర్సాపూర్

మూడు బస్సులు మారాలి 

రాజన్న సిరిసిల్ల జోన్  హెడ్డాఫీస్  కరీంనగర్. ప్రతి పనికి అక్కడికి పోవాల్సిందే. నర్సాపూర్  ప్రాంత వాసులు అక్కడికి వెళ్లాలంటే150  కిలో మీటర్లు ప్రయాణించాలి. మూడు బస్సులు మారాలి. గతంలో మాదిరిగా చార్మినార్​జోన్ కు మారిస్తే హెడ్డాఫీస్ ​హైదరాబాద్ లో ఉంటుంది. మెదక్​ జిల్లాలోని అన్ని ప్రాంతాల వారికి సౌకర్యంగా, దగ్గరగా ఉంటుంది. పైగా హైదరాబాద్  సిటీలో ప్రైవేట్  సెక్టార్​లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయి. 

 రాకేశ్, వెల్మకన్న, కౌడిపల్లి మండలం