అక్రమ నిర్మాణాల కూల్చివేత .. నార్సింగిలో టెన్షన్ టెన్షన్

అక్రమ నిర్మాణాల కూల్చివేత .. నార్సింగిలో టెన్షన్ టెన్షన్

ఫుట్ పాత్‭పై అక్రమంగా వెలసిన నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమంగా నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. అయితే వారిని స్థానిక వ్యాపారులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఉన్నపళంగా కూల్చి వేస్తే తాము రోడ్డున పడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారంటూ నిలదీశారు.  

ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్నామని.. ఇప్పుడు ఉన్నట్టుండి తమ షాపులను తొలగిస్తున్నారని అధికారులపై వ్యాపారులు మండిపడ్డారు. విలువైన వస్తువులు ధ్వంసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జేసీబీలు తీసుకువచ్చి షాపులను కూల్చివేయడంపై ఆందోళనకు దిగారు. అక్రమ నిర్మాణాలను వదిలేసి ఫుట్ పాత్ పై ఉన్నవాటిని కూల్చివేయడం సరికాదని స్థానికులు అంటున్నారు. మరోవైపు ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే సహించే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరించారు.