- ప్రజాభవన్‌లో ఇంధన శాఖపై రివ్యూ
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని థర్మల్ పవర్ స్టేషన్లకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలన్నారు. మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్ లో ఇంధనశాఖపై రివ్యూ నిర్వహించారు.
రాష్ట్రంలోని అన్ని థర్మల్ పవర్ స్టేషన్లకు నిరంతరాయంగా నాణ్యమైన బొగ్గును సప్లై చేయడానికి సింగరేణి గనుల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయనునట్టు భట్టి ప్రకటించారు. ఈ పరిశీలనలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, నాణ్యతపై ఎదురవుతున్న సమస్యలపై అక్కడే రివ్యూలు చేసి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. థర్మల్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు సకాలంలో అందించి, ఉత్పత్తిలో వేగం పెంచడం, సరఫరా వ్యవస్థలో ఆటంకాలను తొలగించడమే ఈ పరిశీలన ముఖ్య ఉద్దేశమన్నారు.
సెప్టెంబర్‌లో వైటీపీఎస్ 5వ యూనిట్‌ను ప్రారంభిస్తం
సెప్టెంబర్‌లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్) 5వ యూనిట్‌ను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. 2023లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైటీపీఎస్ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు సాధించి పనులను స్పీడప్ చేశామని గుర్తుచేశారు.
పనులు ప్రారంభించిన ఏడాదికే అంటే 2025లోనే 800 మెగావాట్ల యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని మొదలు పెట్టినట్టు చెప్పారు. ఏడాదిన్నరలో మరో మూడు యూనిట్లు ప్రారంభించామన్నారు.
