ఒక్కరోజే మహిళలకు రూ.41 కోట్ల51 లక్ష వడ్డీ లేని రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి

ఒక్కరోజే మహిళలకు రూ.41 కోట్ల51 లక్ష వడ్డీ లేని రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్ లో గత పదేళ్ల నుంచి వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక తిరిగి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు.  జూబ్లీహిల్స్ లో మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన ఆయన..  కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు.  సంవత్సరానికి 20 వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటే అందరూ నవ్వారు.. మొదటి సంవత్సరంలోనే 21 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు భట్టి విక్రమార్క. 

‘ హైదరాబాద్ లో 50,764 గ్రూపులున్నాయి, ఐదు లక్షలకు పైగా సభ్యులున్నారు. త్వరలో మరిన్ని మహిళా గ్రూపులు పెంచి, వారందరికీ రుణాలు అందిస్తాం. ఈ రోజు 41 కోట్ల 51 లక్షల వడ్డీ లేని రుణాలు మహిళలకు అందిస్తున్నాం.  జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 8 వేల మంది మహిళలు లబ్ది పొందబోతున్నారు. భర్తతో పాటు భార్య కూడా కుటుంబ పోషణ చూసుకుంటుంది. చిరు వ్యాపారాలు చేసుకునే వారి నుంచి బస్సులు ఇప్పించే వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నాం. భవిష్యత్ లో మహిళలు బయట రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇచ్చే వడ్డీ లేని రుణాల వల్ల మహిళలు వ్యాపారస్తులుగా మారి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. 

శిల్పారామం లాంటి ప్రాంతాల్లో మహిళా గ్రూప్ సభ్యులు షాప్స్ నిర్వహిస్తున్నారు.   ఆర్టీసీలో మహిళలు  150 బస్సులు పెట్టారు. త్వరలో వడ్డీ లేని రుణాలు ఇచ్చి మరో 450 బస్సులు ఆర్టీసీలో పెట్టేలా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం.  పేదలందరికీ పది లక్షల వరకు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కి అయినా వెళ్ళి వైద్యం పొందేలా ఆరోగ్యశ్రీ ను తీసుకొచ్చాం.  రేషన్ కార్డు దారులందరికీ సన్న బియ్యం ఇస్తున్నాం. పది సంవత్సరాలుగా ఒక్క కొత్త రేషన్ కార్డు రాలేదు. మహిళలు ఆర్థికంగా బలంగా నిలబడితే కుటుంబం బాగుంటుంది. అర్హులైన ప్రతీ ఒక్కరికీ వడ్డీలేని రుణాలు అందిస్తాం’. అని భట్టి విక్రమార్క అన్నారు.