- మొత్తం రాష్ట్రానికే ఆ ఎగ్జిబిషన్ పండగ లాంటిది
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నంతో కలిసి 85వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభం
బషీర్‌బాగ్, వెలుగు: ఏటా నిర్వహించే నుమాయిష్ హైదరాబాద్ నగరానికే కాకుండా మొత్తం రాష్ట్రానికి పెద్ద ఉత్సవం లాంటిదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నైపుణ్యాల ప్రదర్శనకు నుమాయిష్ వేదికగా మారిందన్నారు. రాష్ట్ర సంస్కృతి, వైభవానికి నుమాయిష్ చిహ్నంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 85వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 2026 నుమాయిష్ ను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ ను చూసేందుకు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రకాల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలకు నుమాయిష్ వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. నుమాయిష్ పారిశ్రామిక ప్రదర్శన మాత్రమే కాదని, నేక సంస్కతుల కలయిక అని చెప్పారు.
ఎన్నో ఏండ్ల కిందే లోకల్ టు గ్లోబల్‌కు పునాది వేసింది: శ్రీధర్ బాబు
1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన యువత సాంస్కృతిక స్వతంత్రత సాధించాలనే తపనతో ప్రారంభించిన నుమాయిష్ నేడు హైదరాబాద్‌కు సిగ్నేచర్‌గా, తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా ఎదిగిందని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సాధారణంగా ఏ ఎగ్జిబిషన్ అయినా పదేళ్లకో, ఇరవయ్యేళ్లకో తన ప్రాభవాన్ని కోల్పోతుందని, కానీ నుమాయిష్ మాత్రం ఏటా తనను తాను పునఃసృష్టించుకుంటూ ముందుకు సాగుతోందన్నారు.
నుమాయిష్ ఎన్నో దశాబ్దాల క్రితమే ‘లోకల్ టు గ్లోబల్’ భావనకు పునాది వేసిందని తెలిపారు. ‘‘ఆన్‌లైన్ మార్కెట్లలో వస్తువులు ఇంటి వద్దకే వస్తున్నా, అక్కడ మనిషి కనిపించడం లేదు. నుమాయిష్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వస్తువుతో పాటు దానిని తయారు చేసిన మనిషిని నేరుగా చూస్తం. మాట్లాడతం. ఈ హ్యూమన్ కనెక్షన్ ను ఎలాంటి టెక్నాలజీ అందించలేదు. నుమాయిష్ నుంచి సమకూరే ప్రతి రూపాయిని తిరిగి సమాజానికే వెచ్చిస్తూ ఎగ్జిబిషన్ సొసైటీ కార్యవర్గం ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తోంది.
ఎగ్జిబిషన్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటాం. సొసైటీ ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా” శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, తెలంగాణ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బీఎన్ రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు సుఖేష్ రెడ్డి, కోశాధికారి సంజీవ్ కుమార్, సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్, ప్రతి నిధులు పాల్గొన్నారు.
