48 శాతం మందికి మళ్లీ మోడీనే ప్రధానిగా చూడాలనుంది

48 శాతం మందికి మళ్లీ మోడీనే ప్రధానిగా చూడాలనుంది
  • ఇప్పటికిప్పుడు లోక్​సభ ఎన్నికలు జరిగితే.. ఎన్డీఏకు 362 సీట్లు, యూపీఏకు 97
  • ఇండియా టీవీ ​సర్వేలో వెల్లడి
  • తెలంగాణలో ఎన్డీఎకు 6, యూపీఏకు 2, టీఆర్​ఎస్​ సహా ఇతరులకు 9

న్యూఢిల్లీ : ఇప్పటికిప్పుడు లోక్​సభ ఎన్నికలు జరిగితే మూడోసారి కూడా మోడీ సర్కారే ఏర్పడుతుందని, ఎన్డీఏకు మొత్తం 362 సీట్లు వస్తాయని జాతీయవ్యాప్తంగా ఇండియా టీవీ మాట్రిజ్​ నిర్వహించిన ఒపీనియన్​ పోల్​ సర్వేలో తేలింది. ‘దేశ్​కీ ఆవాజ్’ పేరుతో సర్వే రిజల్ట్స్​ను ఇండియా టీవీ మాట్రిజ్​ శుక్రవారం వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్​సభ ఎన్నికలు జరిగితే యూపీఏ 97 సీట్లలో గెలుస్తుంది. 

అలాగే చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు 84 సీట్లలో విజయం సాధిస్తారు. ఈ నెల 11 నుంచి 24 వరకు ఈ సర్వే నిర్వహించారు. ఓట్ల శాతం చూస్తే ఎన్డీఏకు 41 శాతం, యూపీఏకు 28, ఇతరులకు 31 శాతం ఓట్లు వస్తాయని తేలింది. తెలంగాణలోని 17 సీట్లలో ఎన్డీఏకు 6, యూపీఏకు 2, టీఆర్​ఎస్​ సహా ఇతరులకు 9 సీట్లు వస్తాయని, ఏపీలో అన్ని సీట్లలోనూ (25) వైసీపీ సహా ఇతరులు విజయం సాధిస్తారని సర్వే పేర్కొంది. అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్​లో 80 సీట్లకు ఎన్డీఏ 76 సీట్లను తన అకౌంట్​లో వేసుకుంటుందని, యూపీఏ, ఇతరులు చెరో రెండు సీట్లు గెలుస్తారని సర్వే వివరించింది. ‘‘బిహార్​లో 40 స్థానాలకు ఎన్డీఏ 35, యూపీఏ ఐదు సీట్లు గెలిచే చాన్స్ ఉంది. మహారాష్ట్రలో మొత్తం 48 సీట్లలో ఎన్డీఏ 37, బీజేపీయేతర పార్టీలు మిగతా 11 స్థానాల్లో విజయం సాధించవచ్చు. తమిళనాడులో రూలింగ్​పార్టీ డీఎంకే 39 సీట్లలో 38 చోట్ల విజయం సాధిస్తుంది. బీజేపీకి ఒకేఒక్క సీటు దక్కే అవకాశం ఉంది. ఎల్డీఎఫ్​అధికారంలో ఉన్న కేరళలో బీజేపీయేతర పార్టీలు అన్ని చోట్లా (20 సీట్లు) గెలుపొందుతాయి. 42 సీట్లు ఉన్న వెస్ట్​బెంగాల్​లో అధికార టీఎంసీకి 26, ఎన్డీఏకు 14, యూపీఏకు రెండు సీట్లు రావొచ్చు. ఇక గుజరాత్​లో 26 సీట్లూ ఎన్డీఏ అకౌంట్​లోనే వెళ్తాయి” అని సర్వే పేర్కొంది. 

48 శాతం మందికి మళ్లీ మోడీనే ప్రధానిగా చూడాలనుంది 
ఇక కొత్త ప్రధానిగా ఎవరిని చూడాలని అనుకుంటున్నారని అడగ్గా.. మళ్లీ మోడీనే ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు 48 శాతం మంది చెప్పారు. 11 శాతం మంది రాహుల్​ను, 8 శాతం మమతా బెనర్జీని, 7 శాతం సోనియా గాంధీని, 6 శాతం మాయావతిని, 6 శాతం శరద్​పవార్​ను, 5 శాతం అర్వింద్​ కేజ్రీవాల్​ను, 3 శాతం కేసీఆర్​ను ప్రధానిగా చూడాలనుకుంటున్నామని తెలిపారు. మోడీకి బలమైన ప్రత్యర్థి రాహుల్​ గాంధీ అని 23 శాతం మంది చెప్పగా..  కేజ్రీవాల్​ అని19 శాతం, మమత అని 11 శాతం మంది పేర్కొన్నారు. ఇక నితీశ్, సోనియా మోడీకి బలమైన ప్రత్యర్థి అని 8 శాతం మంది చెప్పారు. 136 పార్లమెంట్​ నియోజకవర్గాల్లో 34 వేల మందిని ఇండియా టీవీ మాట్రిజ్​ఈ సర్వే చేసింది. 34 వేల మందిలో 19,830 మంది మగవారు కాగా, 14,170 మంది ఆడవారు ఉన్నారు.