హైదరాబాద్, వెలుగు: భిన్నత్వంలో ఏకత్వంతోనే ప్రపంచంలో మన దేశం 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. విద్యతోనే అభివృధ్ది సాధ్యమన్నారు. శనివారం రాజ్ భవన్ లో హెచ్ సీయూ, నిట్ పాట్నా ఆధ్వర్యంలో జరిగిన 4వ ఫేస్ యువ సంగం కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడారు. చదువుకుంటే ఎంత పెద్ద సవాళ్లను అయినా అధిగమించవచ్చన్నారు.
ప్రతి వ్యక్తికి సంపద, సంతోషం రెండూ ముఖ్యమని, వాటితో పాటు కుటుంబానికి టైమ్ ఇవ్వాలన్నారు. అలాగే దేశానికీ ఎంతో కొంత చేయాలని సూచించారు. ప్రతిఒక్కరూ స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ప్రొఫెసర్లు, వర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.