- అప్పటి బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ పాలనంతా దోపిడీమయమే
- కేసీఆర్, రేవంత్‌రెడ్డి తెలంగాణను అప్పుల పాలు చేశారు
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి
- ప్రాణహితపై చర్చించేందుకు మహారాష్ట్రకు రావాలని సూచన
- కాగజ్‌నగర్, మంచిర్యాలలో విజయ సంకల్ప సభకు హాజరు
కాగజ్‌నగర్/మంచిర్యాల, వెలుగు: తమ రాష్ట్రానికి నష్టం లేకుంటే తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. తన చొరవ వల్లే తెలంగాణకు సాగునీరు అందిందన్నారు. 2 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాణహిత ప్రాజెక్ట్‌పై చర్చించేందుకు మున్సిపల్ ఎన్నికల తర్వాత మహారాష్ట్రకు రావాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్, మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో కలిసి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ... ఎన్నో కలలతో ఏర్పడిన తెలంగాణ అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అన్యాయానికి గురైందన్నారు. రెండు పార్టీల పాలన పూర్తిగా దోపిడీమయంగా మారిందని విమర్శించారు. రూపాయి కూడా లేదని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు.
మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను.. అవినీతి పాలనతో అప్పుల్లోకి నెట్టేశారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన ఫలాలు ఇతరులకు అందుతున్నాయన్నారు. ‘‘తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ అడిగితే నీళ్లిచ్చాను.. కానీ ఆయన మాత్రం మా రాష్ట్ర రైతులకు పరిహారం ఎగ్గొట్టారు” అని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణకు రాహుకేతువుల్లా మారారని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ జీ నగేశ్, మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆశిశ్ షెలార్, బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెరబెల్లి రఘునాథ్‌రావు పాల్గొన్నారు.
కేంద్ర పథకాలతోనే నగరాలు, పట్టణాల అభివృద్ధి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోనే దేశంలోని నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి జరుగుతున్నదని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మంచిర్యాలను స్మార్ట్ సిటీ, అమృత్ సిటీగా మారుస్తామని, సీఎం రేవంత్ సర్కారుతో సంబంధం లేకుండా కేంద్రం నుంచి నేరుగా ఫండ్స్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
మంచిర్యాల పక్కనే గోదావరి పారుతున్నా.. ప్రజలకు తాగునీళ్లు అందించేందుకు గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. మంచిర్యాలలో బీజేపీని గెలిపిస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పక్కా ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రతిష్టాపన కార్యక్రమానికి మళ్లీ వస్తానని చెప్పారు.
రాష్ట్రంలో ట్యాక్స్ టెర్రరిజం: రాంచందర్ రావు
రాష్ట్రంలో ట్యాక్స్ టెర్రరిజం నడుస్తున్నదని రాంచందర్ రావు విమర్శించారు. ప్రధాని మోదీ సారథ్యంలో కేం ద్రం ఇస్తున్న నిధులను సీఎం రేవంత్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే సెంట్రల్ ఫండ్స్ పక్కదారి పట్టకుండా అవినీతిరహితపాలన అందిస్తామని తెలిపారు. ప్రజల జేబుల్లో చేతులు పెట్టి ట్యాక్స్ రూపంలో ప్రజల నుంచి సొమ్ము లాక్కునేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని ఆరోపించారు. సీఎం రేవంతుద్దీన్‌గా మారి, కొన్ని వర్గాలను తన వెంట నడి పించుకునేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కేంద్రం ఇస్తున్న నిధులతోనే తెలంగాణలో పాలన సాగుతున్నదని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని చెప్పారు. ఓటుకు నోటు కేసులో సాక్ష్యాలన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉన్నాయని, ఇప్పుడు ఆ ల్యాబ్‌లో మంటలు చెలరేగడం..కేసీఆర్ సర్కార్ పడిపోగానే సెక్రటేరియెట్ నుంచి ఫైళ్లు మాయం కావడంపై అనుమానాలు ఉన్నాయన్నారు.
