ఆధ్యాత్మికం: విజయానికి ధైర్యమే ఆయుధం.. కష్టాలను కూడా ఎదురించినప్పుడే వెనక్కు తగ్గుతాయి..!

ఆధ్యాత్మికం: విజయానికి ధైర్యమే ఆయుధం.. కష్టాలను కూడా  ఎదురించినప్పుడే వెనక్కు తగ్గుతాయి..!

‘‘ఒకసారి నేను వారణాసిలో ఉన్నప్పుడు, ఒక వైపు పెద్ద నీటి ట్యాంక్, మరో వైపు ఎత్తైన గోడ ఉన్న ప్రదేశం గుండా వెళ్తున్నాను. ఆ ప్రాంతంలో కోతులు ఎక్కువగా ఉంటాయి. వారణాసిలో ఉండే కోతులు చాలా పెద్దవి, క్రూరమైనవి. కొన్నిసార్లు మొరటుగా కూడా ఉంటాయి. నన్ను అటువైపు వెళ్ళనివ్వకూడదని అవి నిర్ణయించుకున్నాయి, అందుకే నేను వెళ్తుండగా అవి అరుస్తూ, కేకలు వేస్తూ నా కాళ్లను పట్టుకున్నాయి.

అవి మరింత దగ్గరకు వస్తుండగా, నేను పరుగెత్తడం మొదలుపెట్టాను. నేను ఎంత వేగంగా పరుగెత్తితే, కోతులు అంత వేగంగా వచ్చి నన్ను కరవడం మొదలుపెట్టాయి. తప్పించుకోవడం అసాధ్యం అనిపించింది, సరిగ్గా అప్పుడే నాకు ఒక అపరిచితుడు ఎదురయ్యాడు. అతను నన్ను పిలిచి, ‘‘ఆ కోతులను ఎదుర్కోవాలే కాని పరుగులు తీయకూడదు’’ అన్నాడు. 

నేను వెనక్కి తిరిగి కోతులను ఎదుర్కొన్నాను, అవి వెనక్కి తగ్గి చివరకు పారిపోయాయి. అది జీవితం మొత్తానికి ఒక పాఠంలా అనిపించింది. భయంకరమైన దాన్ని ఎదుర్కోవాలి. ధైర్యంగా ఎదుర్కోండి. మనం జీవితంలోని కష్టాల నుండి దూరంగా పారిపోవడం మానేసినప్పుడు, అవి వెనక్కి తగ్గుతాయి.

 మనం ఎప్పుడైనా స్వేచ్ఛను పొందాలంటే, అది ప్రకృతిని జయించడం ద్వారానే సాధ్యం. పారిపోవడం ద్వారా మాత్రం కానేకాదు. పిరికివాళ్ళు ఎప్పుడూ విజయాలు సాధించరు. అందుకే పిరికితనాన్ని విడనాడాలంటే... భయం – కష్టాలు – అజ్ఞానం... వీటితో పోరాడాలి’’ అంటారు స్వామి వివేకానందులు.ధైర్యంగా జీవించడం అలవాటు చేసుకోవాలని వివేకానందుడు జాతిని ఉద్దేశించి పలుమార్లు పలికారు. 

‘బాగా తినండి, బాగా ఆడండి’ అంటూ ఉత్తేజపరిచారు.అంతర్జాతీయ సదస్సులో మాట్లాడటానికి స్వామి వివేకానందకు అవకాశం కలగలేదు. కాని ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ప్రయత్నించాడు. చివరకు ఆయనకు కేవలం అయిదు నిమిషాలు మాత్రమే మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. ఆయన తన ఉపన్యాసం ప్రారంభించారు. ఐదు నిమిషాలు మాత్రమే అనుకున్నది.. నెలల తరబడి ఆయన ఉపన్యాసాలు కొనసాగాయి. వివేకానందుని ధైర్యమే ఆయనను ప్రపంచం గుర్తించేలా చేసింది. తాను ధైర్యవంతునిగా ఉంటూ, మనకు కూడా ధైర్యవంతులుగా ఉండమని బోధించాడు.

మన ఇతిహాసాలైన రామాయణ–మహాభారతాలను పరిశీలిస్తే..  రామాయణంలో సీత, మహాభారతంలో కుంతి, పాండవులు, ద్రౌపది, అభిమన్యుడు, ఉపపాండవులు.. ధైర్యానికి మారుపేరుగా కనిపిస్తారు. 
కైకేయి కోరిన వరాల కారణంగా శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరతాడు. రాముని వెంట వస్తానంది సీతమ్మ. అడవిలో పులులు, సింహాలు వంటి క్రూరమృగాలు ఉంటాయని, రాక్షసులు సంచరిస్తుంటారని, కటిక నేలమీద పరుండవలసి వస్తుందని రాముడు పలికాడు. 

రాముని మాటలకు ఏ మాత్రం జంకలేదు సీతమ్మ. ‘రాముని వెంటే సీత’ అని పలికి, అరణ్యవాసానికి బయలుదేరింది. అడవిలో శూర్పణఖను చూసింది. ఏ మాత్రం బెదరలేదు. రామలక్ష్మణులు కుటీరంలో లేని సమయంలో రావణుడు వచ్చి సీతమ్మను అపహరించి, లంకలో అశోకవనంలో ఉంచాడు. సీతమ్మ చుట్టూ ఎంతోమంది రాక్షసులు. వారు నిరంతరం భయంకరమైన పలుకులు పలుకుతున్నప్పటికీ, సీతమ్మ ఏ మాత్రం ధైర్యం విడిచిపెట్టలేదు. ఏనాటికైనా రాముడు వచ్చి, తనను రక్షిస్తాడనే నమ్మకంతో ఉంది.

 ఒకనాడు రావణుడు సీత దగ్గరకు వచ్చి, ‘నువ్వు నా మాట వినకపోతే, నిన్ను ఉదయపు ఫలహారంగా భుజిస్తాను’ అని బెదిరించినా బెదరలేదు సీతమ్మ. ఆమె ధైర్యమే ఆమెను రక్షించింది. ఎట్టకేలకు శ్రీరాముడు వచ్చి, రావణుడిని సంహరించి, సీతమ్మను తీసుకెళ్లాడు. అంతమంది రాక్షసుల మధ్య ఒంటరిగా ఉన్న సీతమ్మకు.. ధైర్యమే ఆభరణం, ఆయుధం కూడా. 

మహాభారతంలో – కౌరవులతో జరిగిన కపట ద్యూతంలో పాండవులు ఓడిపోయారు. సర్వసంపదలు కోల్పోయారు. ద్రౌపదితో కలిసి పాండవులు అరణ్యాలకు బయలుదేరారు. కుంతీదేవి.. దాయాదులైన కౌరవుల ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. ఏనాటికైనా పాండవులు తిరిగి వచ్చి, రాజ్యాభిషిక్తులవుతారనే ధైర్యంతో జీవించింది కుంతి. పాండవులతో అరణ్యవాసానికి వెళ్లిన ద్రౌపది కూడా ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. 

అజ్ఞాతవాస సమయంలో విరాటుని కొలువులో సైరంధ్రిగా జీవించవలసి వచ్చినప్పుడు కూడా ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. కీచకుడు చెరపట్టడానికి వచ్చినప్పుడు సైతం ధైర్యాన్ని వీడలేదు. ఎలాగైనా కీచకుడిని హతమార్చాలనుకుని పంతం పట్టింది. ఆ విషయాన్ని భీమునికి తెలియపరిచింది. కీచకుడిని సంహరించి, ద్రౌపది పంతాన్ని నెరవేర్చాడు భీముడు.ధైర్యంతో జీవించేవారికి ఓటమి ఉండదని స్వామి వివేకానందుడు చెప్పిన మాటలు అనుసరణీయం, ఆచరణీయం.

- డా. పురాణపండ వైజయంతి-