హిందువులు పౌర్ణమి తిథికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వైశాఖ మాసంలో పౌర్ణమితిథికి చాలా ప్రత్యేకత ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆరోజున చంద్రుడు 16 కళలను ప్రదర్శిస్తూ..సంపూర్ణ తేజస్సును ప్రదర్శిస్తాడు. వైశాఖ పౌర్ణమినే బుద్ధ పౌర్ణమి అని అంటారు. ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజు ఎప్పుడు వచ్చింది.. శుభ ముహూర్తం.. మరి ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి.. ఎలాంటి ఫలితాలుంటాయి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
హిందూ క్యాలండర్ ప్రకారం.. వైశాఖ మాసం శుభకార్యాలకు చాలా ముఖ్యమైనది. ఈ మాసంలోని పౌర్ణమి రోజుకు చాలా ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు.ఈ రోజున పూజలు.. దానధర్మాలు పవిత్ర స్నానాలకు, దైవారాధన చేస్తే విశేషమైన ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది (2026) అలాంటి పవిత్రమైన రోజును మే 1 శుక్రవారం న జరుపుకుంటారు.
వైశాఖ పౌర్ణమి శుభ ముహూర్తం
- వైశాఖ మాసం పౌర్ణమి తిథి ప్రారంభం: ఏప్రిల్ 30 రాత్రి 9:12 గంటలకు
- వైశాఖ మాసం పౌర్ణమి తిథి ముగింపు: మే 1 రాత్రి 10:52 గంటలకు
- పూజకు శుభముహూర్తం: ఉదయం 9.13 గంటల నుంచి 10.53 వరకు.. సాయంత్రం5.50 గంటల నుంచి 7.30 వరకు
ఉదయ తిథి ప్రకారం, మే 1వ తేదీన స్నానం చేయడం, ఉపవాసం ఉండటం, పూజ మరియు దానధర్మాలు వంటి కర్మకాండలు చేయడం చాలా మంచిది.ఆ రోజు ఉదయం అంతా ఉపవాసం ఉండి.. సాయంత్రం చంద్రుడిని దర్శనం చేసుకొని నీటిని సమర్పించిన తరువాత సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి.
శాస్త్రాల ప్రకారం, పౌర్ణమి తిథి ఎంతో శుభప్రదమైనది, కానీ వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి విష్ణుమూర్తి అనుగ్రహం పొందడానికి మరింత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. వైశాఖ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు..
ఆ రోజున( 2026 మే 1) భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజించడం, ఉపవాసం ఉండటం, మంత్ర జపం చేయడం, తపస్సు చేయడం, దానధర్మాలు చేయడం వలన పుణ్యం, సంపద, ఆనందం ,మానసిక ప్రశాంతత లభిస్తాయని నమ్ముతారు. ఆ రోజు సానుకూల శక్తిని వృద్ది చేస్తుంది. ఆ రోజు చేసిన ధార్మిక కార్యక్రమాలు( పూజలు.. దానం) అనేక రెట్లు ఫలితాలను అందిస్తాయి. విష్ణుమూర్తిని పూజించడం, మంత్ర జపం చేయడం, దీపాలు వెలిగించడం దానధర్మాలు చేయడం వలన భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా లభించి జీవితంలోని కష్టాలను తొలగుతాయని పండితులు చెబుతున్నారు.
తెల్లవారుజామునే పవిత్రమైన నదిలో, చెరువులో లేదా ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆ తర్వాత శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం మరియు సామరస్యం లభిస్తాయి.
ఎలా పూజ చేయాలి..
- వైశాఖ పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత, శుభ్రమైన పసుపు రంగు దుస్తులు ధరించి సూర్య భగవానునికి అర్ఘ్యం ( నీటిని) సమర్పించండి.
- విష్ణుమూర్తిని.. లక్ష్మీదేవిని పూజించి .. స్వామి వారికి పసుపు పువ్వులు, తులసి ఆకులు, ధూపం, దీపం, చందనం నైవేద్యాలు సమర్పించండి.
- “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది.
- వైశాఖ పౌర్ణమి నాడు భోజనం, నీరు, సంపద దానం చేయడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. ఆకలితో ఉన్నవారికి, పేదలకు, నిస్సహాయులకు, దివ్యాంగులకు సహాయం చేయడమే దైవ సేవగా భావించబడుతుంది.
- ఆ రోజున ( 2026 మే 1) చేసే దానం పాపాలను పోగొట్టి, సుఖ సంతోషాలు, శాంతి , ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు
- చాలామంది పితృదోషాలవలన కష్టాలు పడుతుంటారు. అలాంటి దోషాల నుంచి విముక్తి పొందాలంటే వైశాఖ పౌర్ణమి ( మే1) వ తేది ఉదయాన్నే నిద్రలేచి, స్నానమాచరించి రావి చెట్టు మొదట్లో (వేళ్లకు) స్వచ్ఛమైన నీటిని సమర్పించాలి. ఆ తర్వాత సాయంత్రం వేళ అదే రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న పితృ దోషాలు శాంతిస్తాయి.
- వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం శుభముహూర్తంలో తులసికోట దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేసి.. పసుపు.. కుంకుమ.. గంధం సమర్పించాలి. లక్ష్మీ దేవి అష్టోత్తరం.. విష్ణుమూర్తి అష్టోత్తరంతో పూజించి తులసీమాత చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తూ నమస్కరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి.. ఐశ్వర్యం వృద్ది చెందుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

