కేరళ అయ్యప్ప స్వామి ఆలయం నెలవారీ పూజల కోసం ఈ రోజు ( జూన్ 14) సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేయనున్నారు. మిథున మాసం సందర్భంగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఐదురోజులపాటు ఈనెల 19 వరకు ప్రత్యేకపూజలు జరుగునున్నాయి.
మలయాళ సాంప్రదాయ ప్రకారం మిథున మాసంలో స్వామివారికి నిర్వహించే ప్రత్యేక నైవేద్యాలు, పడిపూజలు, ఉదయస్తమయ పూజల కోసం ఆలయ ప్రధాన అర్చకులు (మేల్శాంతి) శబరిమలసన్నిధానంలో తంత్రి కందరారు మహేష్ మోహనారు సమక్షంలో ప్రసాద్ సాయంత్రం దీపారాధన చేసి గర్భగుడి తలుపులను తెరుస్తారు.. పూజలు మరియు హారతి కార్యక్రమాలు అన్నీ ముగిసిన అనంతరం, జూన్ 19వ తేదీ రాత్రి ఆలయ తలుపులను మళ్లీ మూసివేస్తారు.
మిథున మాస పూజల్లో శబరిమల సన్నిధానంలో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా చూసేందుకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు .. కేరళ ప్రభుత్వ అధికారులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్ www.sabarimalaonline.org ద్వారా ముందస్తుగా వర్చువల్ క్యూ స్లాట్లను బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు మాత్రమే పంబా బేస్ క్యాంప్ నుండి సన్నిధానానికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం పంబా నది వద్ద మంచినీటి వసతి, వైద్య శిబిరాలు, రవాణా సౌకర్యాలను కల్పించారు. అయ్యప్ప భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా.. స్వామివారి దర్శనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
