మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు, వారి స్వయం ఉపాధికి భద్రతతో కూడిన భరోసానిచ్చేందుకు తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో స్త్రీ రైడ్స్ ప్రాజెక్ట్ ను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ లాంచ్ చేశారు.
మహిళలకు టూ వీలర్, త్రీ వీలర్ వాహనాల డ్రైవింగ్ నైపుణ్యాలను నేర్పించి, వారిని స్వయం సమృద్ధులుగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. మొదటి విడతలో భాగంగా ఎంపిక చేసిన 55 మంది మహిళలకు అంబర్‌పేట్ పోలీస్ లైన్స్‌లో ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేకంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చింది. రవాణా రంగంలో మహిళలపై జరిగే వేధింపులకు అడ్డుకట్ట వేస్తూ, తోటి మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఈ స్త్రీ రైడర్లు ఇప్పుడు సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ... ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత సాధించడమే లక్ష్యంగా ఈ స్త్రీ రైడ్స్ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చామన్నారు. ఇప్పటివరకు గిగ్ వర్క్‌లో, డెలివరీ రంగంలో మగవాళ్ల హవానే చూశామని... ఇకపై ఆ రంగాల్లోనూ ఆడవాళ్లు దూసుకుపోబోతున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
ALSO READ : జంతర్ మంతర్ లో జెన్ జెడ్ జాతర..
హైదరాబాద్ సిటీ పోలీస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా... గతంలో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లకు మహిళా SHOలు లేని లోటును, తాను హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడే మహిళా ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించి సరికొత్త ట్రెండ్ సెట్ చేశానని డీజీపీ గుర్తుచేశారు. ఇప్పుడు అదే నమ్మకంతో 55 మంది మహిళలు ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసుల్లో అడుగుపెడుతున్నారని... భవిష్యత్తులో తెలంగాణ అంతటా లాజిస్టిక్స్, కార్గో, డెలివరీ సర్వీసుల్లోనూ మహిళా డ్రైవర్లకు పెద్దపీట వేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాలన్నా... దేశ GDP పరుగులు పెట్టాలన్నా... మహిళలు భయాన్ని వీడి, ధైర్యంగా సమాజంలోకి వచ్చి అడుగులు వేయాలని డీజీపీ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు.
