ఢిల్లీ జంతర్ మంతర్ లో జెన్ జెడ్ జాతర.. కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టిన ర్యాలీకి భారీగా తరలివచ్చిన యూత్.. ఇంకా ఢిల్లీ చేరుకుంటున్న సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు. శనివారం (జూన్ 6) సీజేపీ చేపట్టిన ర్యాలీకి దేశం నలుమూలలనుంచి భారీగా యువత తరలి రావడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ జనసంద్రమైంది. ర్యాలీలో పాల్గొనేందుకు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు.శాంతియుతంగా ర్యాలీనిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఢిల్లీ వీధుల్లో యువత పోటెత్తారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపుతో జంతర్ మంతర్ కు భారీగా తరలివచ్చారు యువతీయువకులు. జైభీం నినాదాలతో ఢిల్లీ హోరోత్తింది. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘‘నీట్ పేపర్ లీక్ పార్..కడక్ కర్వాయి కరో’’.. ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యి’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
మోదీజీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయండి.. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రదాన్ ను ఎన్నుకున్నాం.. ఆయనకు మేం కట్టిన పన్నులతో జీతం ఇస్తున్నాం.. ఆయన హయాంలో లక్షలాది మంది యువత భవిష్యత్లు అంధకారంలోకి నెట్టబడ్డది.. బొద్దింకలు వస్తున్నాయి.. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్లిపోతున్నారంటూ ట్వీట్స్ చేస్తోంది జెన్ జెడ్. మరోవైపు వేలాదిగా యూత్ తరలివస్తుండటంతో భారీ బందోబస్తు చేశారు ఢిల్లీ పోలీసులు. కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వడమే కాకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
