నీతికథ : స్వామి బోధన .. ఇతరులను బ్లాక్మెయిల్ చేస్తే ఎప్పటికైనా క్షమాపణ కోరాల్సిందే..!

నీతికథ : స్వామి బోధన .. ఇతరులను బ్లాక్మెయిల్ చేస్తే ఎప్పటికైనా క్షమాపణ కోరాల్సిందే..!

పర్వతగిరి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో అన్ని విద్యలు తెలిసిన ఒక స్వామి ఆశ్రమ జీవనం గడుపుతుండేవాడు. ప్రజలకు ఎటువంటి బాధలు, కష్టాలు వచ్చినా వెంటనే ఆ స్వామి దగ్గరికి వెళ్లి  చెప్పుకునేవారు. అప్పుడు ఆ స్వామి పవిత్ర హృదయంతో  సమస్యలను చాలా ఓపికతో విని మంచి విషయాలను, పరిష్కారం మార్గాలు బోధించేవాడు. స్వామి చెప్పిన విషయాలను ఆచరిస్తూ ప్రజలు సుఖ సంతోషాలు గడుపుతూ ఆనందంగా ఉండేవారు. అనతి కాలానికే స్వామికి ఎంతోమంది ప్రజలు భక్తులుగా మారారు.

చాలామంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఆ స్వామి పేరు ఆ నోట ఈ నోట పడి చుట్టుపక్కల గ్రామాలకు తెలిసిపోయింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత  స్వామికున్న మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలను జీర్ణించుకోలేక అదే గ్రామానికి చెందిన ఒకవ్యక్తి యోగీశ్వరుడైన స్వామి గురించి చెడు చెప్పడం మొదలుపెట్టాడు. స్వామి చెప్పే విషయాలన్నీ అబద్దాలని, ప్రజలను మోసం చేసి డబ్బు, కీర్తి అక్రమంగా సంపాదిస్తున్నాడని  లేనిపోని విషయాలను ప్రచారం చేయసాగాడు. పైగా స్వామి దగ్గరికి వచ్చి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 

ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజున ఆ దుర్మార్గుడు సందర్శకుల వరుసలో స్వామి దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పుడు దారిలో ఒక చెట్టు పైనుండి అప్పుడే పుట్టిన పక్షిపిల్ల గాలికి గూటి నుంచి కింద పడి కనిపించింది. ఆ పక్షి పిల్లను తన చేతిలో పెట్టుకుని స్వామి దగ్గరకు వచ్చాడు.

‘‘ఓ స్వామి.. మీరు చాలా గొప్పవారు కదా! నేను అడిగే ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్తే మీరు మహిమ గల వ్యక్తి అనిపించుకుంటారు. లేకపోతే మీరు మోసం చేస్తున్నట్లే లెక్క అని భావించాల్సి ఉంటుంద’’ని అన్నాడు.
అదనుకోసం వేచి చూస్తున్న ఆ స్వామి ఆ దుర్మార్గుడి మనసు మార్చే సమయం ఆసన్నమైందని మనసులో అనుకుని ‘‘ఏమిటి నాయనా నీ ప్రశ్న?’’ అంటూ వెంటనే అడగమని కోరాడు. అప్పుడు దురాలోచన ఉన్న వ్యక్తి నా పిడికిలో ఉన్న పక్షిపిల్ల సచ్చిందా? బతికిందా? చెప్పు చూద్దాం అని ప్రశ్నించాడు.

అప్పుడు వెంటనే ఆ స్వామి ‘‘నాయన! నువ్వు చాలా తెలివైన వాడివి. ఆ పక్షి పిల్ల ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నవి. అది చావాలన్నా, బతకాలన్నా  అంతా నీ ఇష్టం లోనే ఉన్నది. నేనే కనుక పక్షి పిల్ల బతికింది అంటే చంపేస్తావు. సచ్చింది అంటే బతికిస్తావ్.. నా అభిప్రాయానికి వ్యతిరేకంగా చేయగలవు’’ అని పలికాడు. ఆ మాటలు విన్న దుర్మార్గుడు కొన్ని క్షణాలు ఆలోచించాడు. అతడికి స్వామి చెప్పిన మాటలతో దిమ్మ తిరిగింది. 

అవును అంతా నా చేతిలోనే ఉన్నది కదా! అని అనుకున్నాడు. ఈర్ష్యతో స్వామి చెప్పిన మాటకు వ్యతిరేకం చేసేవాడిని. అట్లా చేస్తే అన్యాయంగా ఆ పక్షి పిల్ల జీవితం ఆగమయ్యేది. ఈర్ష్య, అసూయతో స్వామికి వస్తున్న మంచి పేరును చూసి సహించలేక చెడగొట్టే ఆలోచనతో అలా ప్రవర్తించవలసివచ్చిందని తన మనసులో అనుకుని స్వామి కాళ్లమీద పడి క్షమాపణ కోరాడు. 

వెనువెంటనే ఆ స్వామి ‘‘అప్పుడప్పుడు చెడు ఆలోచనలు ప్రతి వ్యక్తిలో కలుగుతాయని విచక్షణ తెలుసుకుని ప్రవర్తించిన వారే గొప్పవారు అవుతారని హితవు పలికాడు’’. చేసిన పనికి ఆ దుర్మార్గుడు తలవంచుకుని వెనుతిరిగాడు. ఇక అప్పటినుంచి చెడు ఆలోచన లేకుండా ఆనందంగా జీవించడం నేర్చుకున్నాడు.

- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి-

మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు featureseditor@v6velugu.com కి మెయిల్​ చేయండి.