భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే నోటిని కంట్రోల్‌‌‌‌ లో పెట్టుకోవాలి : డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ 

భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే నోటిని కంట్రోల్‌‌‌‌ లో పెట్టుకోవాలి : డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ 
  • కుటుంబ వ్యవస్థలో దంపతులు సర్దుకుపోవాలి
  • ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగాలని సూచన

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ‘‘ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ముందుగా నోటిని కంట్రోలో పెట్టుకోవాలి, ఇద్దరి మధ్య మనస్పర్థాలు వస్తే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, కుటుంబ వ్యవస్థలో దంపతులు సర్దుకుపోవాలి. కోపం అనేది అందరికీ వస్తుంది. ఉద్యోగం చేసే ప్రాంతాల్లో సహోద్యోగులు, బాస్‌‌‌‌పై కోపం వచ్చినప్పుడు నోటి నుంచి చెడ్డ మాటలు రావొద్దు. నోటిని కంట్రోల్‌‌‌‌ చేసుకుంటే వ్యక్తిగత జీవితం సాఫీగా సాగుతుంది’’ అని డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ సూచించారు.

మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్ సిక్ విలేజ్ ఇంపీరియల్ గార్డెన్‌‌‌‌లో “మీ సురక్ష– కలిసుంటే కలదు సుఖం” పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీజీపీ సీవీ ఆనంద్, విమెన్ సేఫ్టీ వింగ్‌‌‌‌ డీజీ చారుసిన్హా, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మహిళలు మగ వారిపై ఆధారపడి ఇంటికే పరిమితమయ్యేవారని గుర్తుచేశారు.

ప్రస్తుతం మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. కుటుంబ వ్యవస్థలో ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగడం చాలా ముఖ్యమన్నారు. గొప్పగా పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా గొడవలు పడి పోలీస్‌‌‌‌ స్టేషన్లకు వస్తున్నారని తెలిపారు. గొడవలు జరగకుండా ఉండాలంటే ముందుగా నోటిని కంట్రోల్ లో పెట్టుకుంటే అంతా సెట్ అవుతుందని సూచించారు. గొడవపడి పోలీస్​స్టేషన్లకు వచ్చి దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కలిసి ఉండాలని భావించిన 150 జంటలను అభినందించినట్లు వివరించారు.

ఇప్పటికే 50 వేలకు పైగా జంటలకు కౌన్సిలింగ్‌‌‌‌ సెషన్స్ నిర్వహించామన్నారు. ఇందులో 6,700 జంటలు విడిపోకుండా కాపాడామని తెలిపారు. మహిళలు.. పురుషులతో సమానంగా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారని, ఒకరినొకరు అర్థం చేసుకొని సంసార జీవితాన్ని కొనసాగించాలని సూచించారు.