- 2021లోనే కోర్టుకు ఓటుకు నోటు కేసు మెటీరియల్
- ఫోన్ ట్యాపింగ్ నివేదికలు ఇప్పటికే పూర్తయ్యాయి
- ఘటనపై నిపుణులతో దర్యాప్తు చేయిస్తున్నం..
- సర్వర్ల బ్యాకప్ రిట్రీవ్ చేస్తం
- ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాద ఘటనలో కొంత మంది కావాలనే పోలీసులను బద్నాం చేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015లో నమోదైన ఓటుకు నోటు కేసు పూర్తి సాంకేతిక ఆధారాలను 2021లోనే కోర్టుకు అందించామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏ ఒక్క రిపోర్ట్ కూడా ఎఫ్‌ఎస్‌ఎల్‌లో లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే చార్జ్‌షీట్ సైతం పూర్తయిందన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్‌తో కలిసి బందోబస్తు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఎల్ ప్రమాదంపై మీడియా అడిగిన పలు ప్రశ్నలకు డీజీపీ వివరణ ఇచ్చారు. “ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో ఏసీబీ కేసు రిపోర్టులు కాలిపోయాయని కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలిసీతెలియక స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదు. పనిగట్టుకొని పోలీసులను బద్నాం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన చాలా రిపోర్టులు కోర్టుకు పంపించాం. కొన్ని మెటీరియల్స్ పరిశీలించాల్సి ఉంది.. కానీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ నిపుణులు, నాగ్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ నిపుణులు ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాద కారణాలను పరిశీలిస్తున్నాం. సర్వర్ల బ్యాకప్ రిట్రీవ్ చేస్తాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’. అని డీజీపీ పేర్కొన్నారు. మక్తల్ బీజేపీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు భారీ బందోబస్తు
రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరుగనున్న పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసిట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాల్లో పూర్తి భద్రత ఉంటుందని, ఇందులో 1,302 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 1,926 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని వెల్లడించారు. పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ 100 శాతం వెబ్ కాస్టింగ్, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ వెలుపల కూడా నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సుమారు 3 వేల మంది అదనపు బలగాలను రంగంలోకి దించామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గత నెల 27 నుంచి మొత్తం రూ.3.09 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఇందులో రూ. 1.29 కోట్ల నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15.7 లక్షల విలువైన మాదకద్రవ్యాలు, రూ.28.69 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని
తెలిపారు.
4,318 మంది బైండోవర్
అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో 20, జిల్లాల సరిహద్దుల్లో 55 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని డీజీపీ వెల్లడించారు. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో తనిఖీలు సాగుతున్నాయని, ఇందుకోసం 181 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 167 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,183 లైసెన్స్డ్ గన్స్‌ను డిపాజిట్ చేయించామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 4,318 మందిని బైండోవర్ చేయడంతోపాటు పెండింగ్‌లో ఉన్న 398 నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేశామని వెల్లడించారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు సంబంధించి142 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణపై క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, భయం లేకుండా ఓటు వేయాలని సూచించారు.
