
- సర్కారుకు కేబినెట్ కమిటీ సూచన
- అక్కడ్నే అప్లికేషన్లు, అప్ లోడింగ్
- ఆఫీసర్లకు, మీసేవ వాళ్లకు ట్రైనింగ్: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో ధరణి హెల్ప్ డెస్కులు పెట్టాలని ధరణి పోర్టల్ పై ప్రభుత్వం వేసిన కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. ‘‘డెస్కుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలె. దరఖాస్తుల అప్ లోడ్ కు మీసేవ కేంద్రాల్లా పని చేసేలా చూడాలె” అని పేర్కొంది. చైర్మన్ హరీశ్ రావు అధ్యక్షతన సబ్ కమిటీ బుధవారం సమావేశమైంది. పోర్టల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం, మాడ్యూళ్లలో మార్పుచేర్పులపై చర్చించింది. నిషేధిత జాబితా భూములపై 98,049 దరఖాస్తులొస్తే 82,472 పరిష్కారమైనట్టు ఆఫీసర్లు వివరించారు. భూ రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందని, దీని ద్వారా ఏడాదిలోనే 10 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయని హరీశ్ అన్నారు. ప్రస్తుతమున్న మాడ్యూళ్లపై అవగాహన లేక సమస్యలు పరిష్కారం కావడం లేదని అభిప్రాయపడ్డారు. భూ రికార్డుల నమోదులో పొరపాట్లను సరిచేసేందుకు కావాల్సిన మాడ్యూళ్లను త్వరగా అందుబాటులోకి తేవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ‘‘ధరణి పోర్టల్, మాడ్యూళ్లు, ఆప్షన్లపై కిందిస్థాయి ఆఫీసర్లకు, మీసేవ ఆపరేటర్లకు జిల్లా స్థాయిలో ఒక రోజు ట్రైనింగ్ ఇయ్యాలె. జడ్పీ, మున్సిపల్ మీటింగుల్లో కలెక్టర్లు కూడా పాల్గొనాలె. పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు , కౌన్సిలర్లు, అధికారులకు ధరణిపై అవగాహన కల్పించాలె” అని ఆదేశించారు.
వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాలె
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ మరింత స్పీడప్ చేయాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. బుధవారం అన్ని జిల్లాల హెల్త్ ఆఫీసర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.డీఎంహెచ్‌వోల నుంచి మెడికల్ ఆఫీసర్ల దాకా అందరూ స్థానికంగా ఉంటూ వ్యాక్సినేషన్‌పై ఫోకస్ చేయాలని సూచించారు. ఇదే అంశంపై వారం తర్వాత కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని మంత్రి చెప్పారు.