- కేసీఆర్ చనిపోవద్దు.. బీఆర్ఎస్ చావడం ఆయన కళ్లారా చూడాలె: ఎంపీ అర్వింద్
- ప్రపంచానికి ట్రంప్..రాష్ట్రానికి కేసీఆర్.. ఇద్దరూ ఎంటర్ టైనర్లే
- జగిత్యాలలో జరిగింది టీడీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
- కేసీఆర్‌కు లై డిటెక్టర్ టెస్ట్ పెడితే లయర్.. లయర్ అని వస్తదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ‘తెలంగాణను కేసీఆర్ నాశనం చేసినంతగా ఇంకెవ్వరూ చేయలేరు. పది మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా కేసీఆర్ స్థాయి విధ్వంసం చేయడం వారి వల్ల కాదు’ అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. జగిత్యాలలో జరిగింది బీఆర్ఎస్ సభ కాదనీ.. అది కేసీఆర్, జీవన్ రెడ్డి, ఎల్ రమణల 'టీడీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం' అని, అక్కడ ముగ్గురూ కలిసి చంద్రబాబు బర్త్ డే వేడుకలు జరుపుకున్నారని సెటైర్ వేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ తీరు ఏడాదికోసారి వచ్చే వెబ్ సిరీస్ లాగా ఉందని అర్వింద్ విమర్శించారు. కేసీఆర్ సీజన్-8 మొదలైందనీ, నిత్యం ప్రజల్లో ఉండాల్సిన నాయకుడు ఏడాదికి ఒకసారి బయటకు వస్తున్నారని చెప్పారు. వయసు పైబడటంతో ఆయనకు వ్యక్తుల పేర్లు, నియోజకవర్గాల పేర్లు కూడా గుర్తుండటం లేదనీ, కేసీఆర్ శకం ముగిసిపోయిందన్నారు. పదేళ్ల పాలనలో ఎన్ఆర్ఐలకు చేసిందేమీ లేదు కానీ, తన బిడ్డ కవితకు, కొడుకు కేటీఆర్‌కు మాత్రం పునరావాసం కల్పించి బాగా మేపారని విమర్శించారు.
అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్..
కేసీఆర్ అంత అబద్ధాలకోరు రాజకీయ చరిత్రలోనే ఎవరూ ఉండరని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు లై డిటెక్టర్ టెస్ట్ పెడితే.. ఆయన నోరు విప్పకముందే మిషన్ లయర్.. లయర్ అని అరుస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చనిపోతానని డీఎస్ కు ఫోన్ చేసి బతిమిలాడి స్టేట్ మెంట్ ఇప్పించుకున్నారనీ, కేసీఆర్ దీక్ష విరమిస్తే సంగతి చూస్తామని అప్పట్లో ఓయూ విద్యార్థులు సిద్ధంగా ఉండేవారని గుర్తుచేశారు. కానీ ఈయన మాత్రం చావనోట్లో తల పెట్టానని కలరింగ్ ఇచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర వాళ్లు చెరువులను నాశనం చేశారని చెప్పే కేసీఆర్.. మిషన్ కాకతీయ పేరుతో 46 వేల చెరువులను బాగు చేశానని అబద్ధాలు చెబుతున్నారని అర్వింద్ విమర్శించారు. 46 వేల చెరువులు కాదు కదా.. కనీసం 46 చెరువులను కూడా ఆయన బాగు చేయలేదన్నారు.
అందరూ బీజేపీలోకి రావాలి
కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని అర్వింద్ అన్నారు. సంజయ్ ని కాంగ్రెస్ లోకి తీసుకోవడంతో జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని, సంజయ్ మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ వచ్చి బీజేపీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అర్వింద్ స్పష్టం చేశారు.
ట్రంప్‌లాగే కేసీఆర్‌తో ఫుల్ ఎంటర్టైన్మెంట్
ప్రపంచానికి డొనాల్డ్ ట్రంప్ ఎలాగో.. తెలంగాణకు కేసీఆర్ అలాగని ఎద్దేవా చేశారు. వీరిద్దరితో ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ తప్ప ఏమీ ఉండదన్నారు. కేసీఆర్ చనిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదనీ, ఆయన బతికే ఉండాలి.. కానీ తన కళ్లముందే బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోవడం ఆయన చూడాలని అన్నారు. కేటీఆర్, కవిత, సంతోష్ రావులను రాష్ట్రం నుంచి పంపించేస్తేనే తెలంగాణకు పట్టిన శని వదులుతుందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు లిల్లీ.. యువర్ సో సిల్లీ అన్నట్లు ఉందని అర్వింద్ ఎద్దేవా చేశారు.
రేవంత్ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదనీ, పాత ఉద్యోగాలను కోర్టు ఇప్పిస్తే.. అవి నేనే ఇచ్చానని డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి, కేసీఆర్‌కు లాగుల మీద అంత ప్రేమ ఏందో అర్థం కావడం లేదనీ, ఒకరు లాగులో తొండలు వదులుతామంటే.. ఇంకొకరు లాగులు పగలగొడతామంటున్నారని విమర్శించారు.

