డయాలసిస్ తాత్కాలికం.. కిడ్నీ దానమే శాశ్వత పరిష్కారం: శ్రీభూషణ్ రాజు  

డయాలసిస్ తాత్కాలికం.. కిడ్నీ దానమే శాశ్వత పరిష్కారం: శ్రీభూషణ్ రాజు  

హైదరాబాద్, వెలుగు:  తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడే రోగులకు డయాలసిస్ వంటి చికిత్సలు తాత్కాలికమేనని, వారి సమస్యకు అవయవ మార్పిడి ఒక్కటే శాశ్వత పరిష్కారమని జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాన్ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు స్పష్టం చేశారు. ప్రపంచ అవయవ మార్పిడి దినోత్సవం సందర్భంగా శనివారం బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని పార్క్ హయత్ హోటల్‌లో అపోలో హాస్పిట్స్ ఆధ్వర్వ్యంలో నిర్వహించిన ‘ఏ కీ దట్ ఓపెన్స్ న్యూ హోప్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 

దేశంలో 8 వేల మంది అవయవాల కోసం ఎదురు చూస్తున్నారని, ప్రతి నెలా కొత్తగా 150 మంది రిజిస్టర్ అవుతున్నారని వెల్లడించారు. తెలంగాణలో సుమారు 15 వేల మంది డయాలసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై ఉన్నారని, వీరందరికీ పునర్జన్మ లభించాలంటే ప్రజలు అవయవ దానానికి ముందుకు రావాలన్నారు.

 మహారాష్ట్రలో 1.5 లక్షల మంది అవయవ దానానికి ప్రతిజ్ఞ చేయగా, తెలంగాణలో ఆ సంఖ్య కేవలం 20 వేల దగ్గరే ఆగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై అవయవాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే రోగుల కుటుంబ సభ్యులతోనూ ఆర్గాన్ డొనేషన్ ప్లెడ్జ్ చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

వైద్యం భారం కావొద్దు.. 

అవయవ దానం ద్వారా ఇతరులకు ప్రాణం పోయడం అత్యంత పవిత్రమైన కార్యమని, తాను కూడా తన అవయవాలను దానం చేస్తానని డీజీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. పోలీసులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి నిమిషాల్లో అవయవాలను ఆస్పత్రులకు చేరవేస్తున్నారని చెప్పారు. ఇదేసమయంలో కార్పొరేట్ ఆస్పత్రుల  తీరుపైనా ఆయన స్పందించారు. 

అవయవ మార్పిడి చికిత్సలను ఆస్పత్రులు కమర్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా మార్చేశాయని, టెస్టులు, బిల్లులు, అవసరం లేని సర్జరీల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నాయని విమర్శించారు. చికిత్స ఖర్చు విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయంలో ఆస్పత్రులు మానవత్వంతో ఆలోచించాలని కోరారు. పారదర్శకమైన విధానం ఉంటేనే ప్రజలు అవయవ దానానికి మరింతగా ముందుకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. 

అపోలోలో 27,500 ట్రాన్స్ ప్లాంటేషన్లు  

దేశవ్యాప్తంగా అపోలో హాస్పిటల్స్ లో1984 నుంచి ఇప్పటివరకు 27,500కు పైగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి అయ్యాయని అపోలో హాస్పిటల్స్ తెలుగు రాష్ట్రాల సీఈఓ తేజస్వీ రావు వీరపల్లి తెలిపారు. ఇందులో 21,500 కిడ్నీ, 5,000 లివర్, 400 హార్ట్ -లంగ్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంట్లు ఉన్నాయన్నారు. సీనియర్ సర్జన్ డాక్టర్ గోఖలే మాట్లాడుతూ.. గుండె, ఊపిరితిత్తుల దానంపై ఇంకా అపోహలు ఉన్నాయన్నారు. 

కిడ్నీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ సర్జన్ డాక్టర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కుటుంబసభ్యులు సాహసోపేత నిర్ణయం తీసుకుంటేనే ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంట్ల సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అవయవ దానం చేసి ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపిన పలువురు దాతల కుటుంబాలను అపోలో యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో డాక్టర్ శరత్ పుట్టా, డాక్టర్ రాఘవేంద్రబాబు పాల్గొన్నారు.