ఈ సండే స్పెషల్.. మ్యాంగో వెరైటీలు మీ కోసం

ఈ సండే స్పెషల్.. మ్యాంగో వెరైటీలు మీ కోసం

పచ్చి మామిడి, పుల్ల మామిడి, కొబ్బరి మామిడి, బంగినపల్లి, రసాలు..  అబ్బబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలో. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేర్లే వినిపిస్తున్నాయి. ఫ్రూట్ మార్కెట్ మొదలుకొని తోపుడు బండ్లు, జ్యూస్ షాపులు.. ఆన్లైన్​లోనూ మామిడి వెరైటీలు బోలెడు దొరుకుతున్నాయి. ఎండలను చల్లబరిచేందుకు వానలు ఎలాగూ పడుతున్నాయి. మరి కడుపు చల్లగా ఉండాలంటే సమ్మర్ స్పెషల్స్ చేసుకోవాల్సిందే కదా. ఇంకెందుకాలస్యం.. మ్యాంగో డేస్ వచ్చేశాయి కాబట్టి ముచ్చటగా మూడు రకాల వెరైటీలు మీకోసం.

ఆమ్ రస్

కావాల్సినవి :
మామిడి పండ్లు – రెండు (పెద్దవి),
యాలకుల పొడి – అర టీస్పూన్,
కుంకుమ పువ్వు – చిటికెడు,
చక్కెర పొడి లేదా బెల్లం – రెండు టీస్పూన్లు,
శొంఠిపొడి లేదా
జాజికాయ పొడి – పావు టీస్పూన్

తయారీ: 

మామిడి పండ్లను శుభ్రంగా కడిగి, తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. వాటిని మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ గుజ్జును ఒక గిన్నెలోకి తీసి అందులో చక్కెర పొడి వేసి కలపాలి. తర్వాత అందులో యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి మరోసారి కలపాలి. చివరిగా కుంకుమ పువ్వు చల్లుకుని తినడమే. అయితే దీన్ని మరోలా కూడా తినొచ్చు. అదెలాగంటే మామిడి పండు గుజ్జులో మిగతా ఇంగ్రెడియెంట్స్ అన్నీ వేశాక పాలు లేదా నీళ్లు కూడా కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నె లేదా గ్లాసులోకి తీసుకుని ఫ్రిజ్​లో ఉంచాలి. ఒక గంట తర్వాత తీస్తే చల్లగా, తియ్యగా ఉండే ఆమ్​ రస్​ని లాగించేయొచ్చు. కొంతమంది దీన్ని పూరి, రోటీ కాంబినేషన్​తో ఎంజాయ్ చేస్తారు.  

లస్సీ
.
కావాల్సినవి : 
మామిడి పండు ముక్కలు, పెరుగు – ఒక్కోటి రెండు కప్పులు
తేనె – నాలుగు టేబుల్ స్పూన్లు
క్రీమ్ – రెండు టేబుల్ స్పూన్లు
ఐస్ క్యూబ్స్ – సరిపడా
యాలకుల పొడి – అర టీస్పూన్

తయారీ :

మామిడి పండు ముక్కలు, తేనె, యాలకుల పొడి మూడింటినీ మిక్సీపట్టాలి. మెత్తగా తయారైన
ఆ మిశ్రమంలో పెరుగు, ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి గ్రైండ్ చేయాలి.
ఆ మిశ్రమాన్ని గ్లాసులో పోసి పైన మామిడి పండు ముక్కల్ని వేయాలి. యమ్మీ యమ్మీ మ్యాంగో లస్సీ టేస్ట్ సూపర్​గా ఉంటుంది. 

కుల్ఫీ

కావాల్సినవి :
మామిడి పండు ముక్కలు – ఒక కప్పు
పాలు – ఒకటిన్నర కప్పు
కండెన్స్డ్ మిల్క్ లేదా
మిల్క్ మెయిడ్ – ముప్పావు కప్పు
 (మార్కెట్లో దొరుకుతుంది)
క్రీమ్​ – అర కప్పు,  యాలకుల పొడి – 
అర టీస్పూన్, కుంకుమ పువ్వు – చిటికెడు

తయారీ :  

ఒక మిక్సీజార్​లో మామిడి పండు ముక్కలు, మిల్క్ మెయిడ్​ వేయాలి. పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత అందులో క్రీమ్, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని కుల్ఫీ ఆకారంలో ఉన్న గ్లాస్​ లేదా మౌల్డ్స్​లో పోయాలి. గాలి చొరబడకుండా మూతపెట్టాలి. లేదా అల్యూమీనియం ఫాయిల్​తో సీల్ చేయాలి. వాటిని ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఫ్రిజ్​లో పెట్టాలి. ఆ తర్వాత మూతతీసి, గ్లాసులో నుంచి తీశారంటే తినడమే తరువాయి.

►ALSO READ | ఒత్తిడి పెరిగే కొద్ది సమస్యలు.. హైపర్ టెన్షన్ అవ్వొద్దు!