ఒత్తిడి పెరిగే కొద్ది సమస్యలు.. హైపర్ టెన్షన్ అవ్వొద్దు!

ఒత్తిడి పెరిగే కొద్ది సమస్యలు.. హైపర్ టెన్షన్ అవ్వొద్దు!

ఇప్పుడు యువతలో బాగా పెరిగిపోయింది. పైగా ఇది ఒక్క జబ్బు కాదు.. ఇది వచ్చిందంటే.. వయసు, ఒత్తిళ్లు పెరిగేకొద్దీ సమస్యలు కూడా అధికమవుతాయి. అవి ప్రాణాంతకం కావొచ్చు. కాబట్టి ఈ హైపర్ టెన్షన్ అనే అంశం మీద అవేర్​నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా మే17 తేదీన వరల్డ్ హైపర్ టెన్షన్​ డేగా ప్రకటించారు. ఈ సందర్భంగా హైపర్​ టెన్షన్ గురించి ఎన్నో అంశాలు డాక్టర్ రాజేశ్​ మాటల్లో...

ఈ మధ్యకాలంలో యువతలో హైపర్ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. దానికి కారణాలు.. వెస్ట్రనైజేషన్​కు అలవాటు పడడం. ఇదివరకు ఉన్న ఆహార పద్ధతులకు, ఇప్పటికీ చాలా తేడాలు వచ్చాయి. ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. వంట చేసుకోవడానికి పెద్దగా హైరానా పడకుండా సూపర్ మార్కెట్​లో దొరికే ‘రెడీ టు ఈట్’​ ప్రొడక్ట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. లేదంటే ఆల్రెడీ తయారైన ఫుడ్​ని కొనుక్కుని తినేస్తున్నారు. పైగా అవి ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ ఉంటున్నాయనేది మర్చిపోతున్నారు. 

వీటిలో కొవ్వులు, ఉప్పు, చక్కెర వంటి క్యాలరీలు పెంచే పదార్థాలు ఎక్కువ ఉంటాయని తెలిసినా అవి అస్సలు పట్టించుకోవట్లేదు. ఇలాంటివి తిన్నప్పుడు బ్లడ్​ ప్రెజర్​ మీద ఎఫెక్ట్ పడుతుంది.  అంతేకాదు.. చాలామంది ఎక్కువగా చేసే తప్పు ఏంటంటే.. రాత్రుళ్లు భోజనం చేసి, పగలు బ్రేక్​ఫాస్ట్ మానేస్తున్నారు. ఇది కూడా బ్లడ్ ప్రెజర్​కి దారితీస్తుంది.  బ్లడ్ ప్రెజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెరగడానికి మరొక కారణం వర్క్ ప్రెజర్. చాలామంది వర్క్ పరంగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం చేసే పనులకు టార్గెట్లు ఉంటాయి. అవి రీచ్ అవ్వాలనే ఆలోచనతో టెన్షన్, ఒత్తిడి పెరుగుతుంది. దానికోసం ఎక్కువగంటలు పని చేయాల్సి వస్తుంది. వీటన్నింటి వల్ల బ్లడ్ ప్రెజర్ మీద ఒత్తిడి పడుతుంది. 

►ALSO READ | Happy Mother’s Day 2025: కనిపించే దైవం అమ్మ..ఎందుకంటే.?

 నిజానికి గతంలో పెద్ద వయసు వాళ్లలో మాత్రమే బ్లడ్ ప్రెజర్ కనిపించేది. కానీ ఇప్పుడు అలా లేదు. వయసుతో సంబంధం లేకుండా హైపర్ టెన్షన్ కనిపిస్తోంది. యువతలో ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి వాళ్లు ముందుగా గుర్తించలేకపోవడం, మరికొందరు గుర్తించినా అదుపులో ఉంచుకోకపోవడం, ఇంకొందరైతే ‘ఈ వయసులో నాకు ఎందుకు బీపీ వస్తుంది?’ అని నిర్లక్ష్యం చేయడం కూడా కారణాలే. 

వరల్డ్ హైపర్ టెన్షన్ డే..

‘మీ బీపీని వెంటనే చెక్ చేసుకోండి. కంట్రోల్​ చేయండి. ఎక్కువకాలం బతకండి’ ఇదే ఈ ఏడాది థీమ్. ప్రస్తుతం ఎవ్వరిని చూసినా బిజీ లైఫ్​ అయిపోయింది. ప్రతి ఒక్కరూ పరుగెడుతూనే ఉన్నారు. వాళ్లూ వీళ్లూ అనే తేడా లేకుండా.. అందరూ ఏదో ఒక ఒత్తిడికి గురవుతున్నారు. తద్వారా హెల్దీ డైట్ మెయింటెయిన్ చేయట్లేదు.. నిద్ర సరిపోవడం లేదు. దానికితోడు ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమంటూ స్మోకింగ్, డ్రింకింగ్​ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఎప్పుడో రావాల్సిన రోగాలు.. కాస్త ముందుగానే వచ్చేస్తున్నాయి. వాటిలో ఈ హైపర్ టెన్షన్​ ఒకటి. బీపీ అని పిలుస్తుంటాం కదా అదే. 

శ్రద్ధ తీసుకోవాలి

సాధారణంగా బీపీ120/80 ఉంటే నార్మల్​గా ఉన్నట్టు అని అర్థం.130 –135 వరకు ఉన్నా పెద్దగా డేంజర్ లేదు. అదే140/90 ఉంటే మాత్రం ప్రమాదకరం. అందుకని మాటిమాటికీ హాస్పిటల్​కి వెళ్లి బీపీ చెక్​ చేయించుకోమని కాదు.. కానీ, ఈ రోజుల్లో హెల్త్​ గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మేలు. ఇప్పుడు డిజిటల్ వాచ్​లు, స్మార్ట్​ ఫోన్​లో యాప్​లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి టెక్నాలజీని కూడా వాడుకోవాలి. ఏదైనా తేడాగా అనిపిస్తే.. వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లి చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ సూచనల మేరకు తగు జాగ్రత్తలు పాటించాలి. 

ఈ లక్షణాలు ఉంటే.. 

నార్మల్​గా ఉన్న వ్యక్తిలో కూడా బ్లడ్ ప్రెజర్ అబ్​నార్మల్​గా కనిపించడం, లోపలి అవయవాల మీద ఒత్తిడి పెరగడం వంటి పరిస్థితులు కనుగొన్నారు. అందువల్ల బీపీని సైలెంట్​ డిసీజ్​ అంటారు. కాకపోతే కొన్ని లక్షణాలను బట్టి బీపీ చెక్​ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటంటే... తల దిమ్ముగా అయిపోవడం, ఏకాగ్రత లేకపోవడం, గుండె దడగా అనిపించడం, కాళ్లలో వాపులు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిద్ర పట్టకపోవడం వంటివన్నీ బీపీ లక్షణాలు. ఇలాంటివి కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. 

అలవాట్లు మార్చుకుంటే చాలు

గతంలో ప్రమాదరకమైన జబ్బులుగా చూసేవి ఇప్పుడు చాలా కామన్​ అయిపోయాయి. వాటిలో హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్షన్, డయాబెటిస్, మానసిక ఒత్తిడి వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూత్​  ఎక్కువగా హైపర్ టెన్షన్​ బారిన పడుతున్నారు. దాని వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కూడా వాళ్లే. దానికి కారణం వాళ్లకున్న అలవాట్లు. ప్రాబ్లమ్ ఉందని తెలిసినా కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదానికి దారితీస్తుంది. ముఖ్యంగా నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిళ్లు పెరగడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కాబ్టటి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు. 

ఆ రెండే..

బీపీ సాధారణ స్థాయిలు మించిపోవడానికి, తిరిగి కంట్రోల్ కాకపోవడానికి ముఖ్యకారణాలు రెండు. అవే స్మోకింగ్, డ్రింకింగ్. వీటివల్లే బీపీ పేషెంట్లు పెరిగిపోతున్నారు. యువతలో ఎక్కువగా ఈ కేసులు బయటపడడానికి కూడా ఈ రెండు కారణాలు కీలకంగా కనిపిస్తున్నాయి. 

బీపీ మానిటరింగ్

హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తికి దాని సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. వాటిలో గుండె సంబంధిత వ్యాధులు, బ్రెయిన్​ స్ట్రోక్, మెదడు పనితీరు లోపించడం, కిడ్నీ, కంటి సమస్యలు వంటివి రావొచ్చు. ప్రస్తుతం 24 గంటలు బీపీ మానిటరింగ్ చేసే ఎక్విప్​మెంట్​ అందుబాటులోకి వచ్చింది. బీపీ పేషెంట్​ వస్తే వాళ్లలో ప్రెజర్ ఏ లెవల్​లో​ ఉంది? ఎంత కంట్రోల్​లో ఉంటుంది? మెడిసిన్ వాడాక జరిగిన బెనిఫిట్స్​ ఏంటి? రావాల్సిన లెవల్స్​కి వస్తున్నాయా? లేదా? అనేది మానిటరింగ్ ద్వారానే తెలుస్తుంది.  

- డా. రాజేష్ వుక్కల,చీఫ్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్,రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్-