- సర్పంచ్ క్యాండిడేట్ మామకు దళం పేరుతో లెటర్ ఇచ్చి, గన్‌తో బెదిరింపు
- ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రణవెల్లిలో ఘటన
కాగజ్‌నగర్, వెలుగు : ‘సర్పంచ్ బరి నుంచి తప్పుకోండి.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి సర్పంచ్ క్యాండిడేట్ మామను గన్‌తో బెదిరించి, దళం పేరిట ఓ లెటర్ ఇచ్చారు. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రణవెల్లి గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రణవెల్లి సర్పంచ్ క్యాండిడేట్‌గా జాడి బాపు కోడలు దర్శన నామినేషన్ వేశారు. గురువారం సాయంత్రం బాపు, అతడి సోదరుడు కలిసి ప్రాణహిత కెనాల్ వద్ద పశువులను మేపిన అనంతరం ఇంటికి తిరిగి వస్తున్నారు.
ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి స్కూటీపై బాపు వద్దకు వచ్చి... ‘మీరు సర్పంచ్‌గా పోటీలో ఉన్నారు. ఇప్పటికే రూ. 2 లక్షల వరకు ఖర్చు చేశారు. వెంటనే విత్‌డ్రా చేసుకోండి.. ఈ విషయం ప్రజలకు, పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని గన్‌తో బెదిరించి ఓ లెటర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో భయపడిన బాపు వెంటనే ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు విచారణ చేపట్టినట్లు కౌటాల సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై నరేశ్ చెప్పారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోనప్ప సర్పంచ్ క్యాండిడేట్ దర్శన ఇంటికి వెళ్లి మాట్లాడారు. బెదిరింపులకు భయపడొద్దని చెప్పారు. కాగా, ఎన్నికల బరి నుంచి తప్పుకునే ఆలోచన లేదని క్యాండిడేట్ దర్శన, ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.
