2027 ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్ టాప్-4 ఎవరో చెప్పిన అశ్విన్.. ఏకంగా కెప్టెన్‌నే పక్కన పెట్టాడు

2027 ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్ టాప్-4 ఎవరో చెప్పిన అశ్విన్.. ఏకంగా కెప్టెన్‌నే పక్కన పెట్టాడు

2027 వన్డే వరల్డ్ కప్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్నాయి. 24 ఏళ్ళ తర్వాత సౌతాఫ్రికా తొలిసారి వన్డే వరల్డ్ కప్ కు ఆతిధ్యమివ్వనుంది. సౌతాఫ్రికాలోని మొత్తం ఎనిమిది నగరాల్లో 44 మ్యాచ్‌లు.. మరో 10 మ్యాచ్‌లకు జింబాబ్వే, నమీబియా ఆతిధ్యమిస్తాయిని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కన్ఫర్మ్ చేసింది. ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఇప్పటి నుంచే ప్రణాళికలు ప్రారంభించింది. ఒకటి రెండు స్థానాలు తప్పితే దాదాపు ప్లేయింగ్ 11 ఖరారైంది. మరో రెండు ఏళ్ళ తర్వాత జరగబోయే ఈ వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా టాప్-4 ఆటగాళ్లు ఎవరో అశ్విన్ తన ప్రిడిక్షన్ తెలిపాడు.        

అశ్విన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. " 2027 వరల్డ్ కప్ కు ఇండియా సౌతాఫ్రికా వెళ్తుంది. అప్పుడు శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి తిరిగి వస్తాడు. అతడు చాలా క్వాలిటీ ప్లేయర్. నాలుగో స్థానంలో ఆడడానికి అర్హుడు. టాపార్డర్ లో రోహిత్, కోహ్లీతో పాటు రుతురాజ్ గైక్వాడ్ ఖచ్చితంగా ఉండాలి. ఓపెనర్లు ఎవరో నాకు తెలియదు. నా అభిప్రాయం ప్రకారం కోహ్లీ, రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభించాలి. కోహ్లీ ఎందుకు ఇన్నింగ్స్ ఓపెన్ చేయకూడదు. టీ20 క్రికెట్ లో విరాట్ ఓపెనర్ గా మనం చూశాం. గైక్వాడ్ మూడో స్థానంలో.. శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలి". అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. 

ఈ సందర్భంగా గైక్వాడ్ బ్యాటింగ్ పై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. "గైక్వాడ్ దగ్గర చాలా షాట్స్ ఉన్నాయి. అతనుపేస్ బౌలింగ్ బాగా ఆడతాడు. స్పిన్నర్లపై ఆధిపత్యం చూపిస్తాడు. చాలా తెలివిగా ఆడతాడు. వన్డేల్లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి అతను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. శ్రేయాస్ తిరిగి వచ్చినప్పుడు కూడా రుతురాజ్‌కు ప్లేయింగ్ 11 లో ఉండాలి. టీమిండియా తరపున భవిష్యత్ లో ఎక్కువ కాలం ఆడగలిగే ప్లేయర్లలో అతనొకడు". అని ఈ దిగ్గజ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. 2027 వరల్డ్ కప్ లో అశ్విన్ టాప్-4లో ప్రస్తుత టీమిండియా వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ కు ఛాన్స్ ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 
            
2027 వరల్డ్ కప్ లో ఈ సారి మొత్తం 14 జట్లకు ఐసీసీ అవకాశం కల్పించింది. ఈ మెగా టోర్నీ 2003 తరహాలో జరుగుతుందని స్పష్టం చేసింది. మొత్తం 14 జట్లు రెండు గ్రూప్ లుగా విభజించబడతాయి. గ్రూప్-ఏ లో ఏడు జట్లతో పాటు గ్రూప్-బి మరో ఏడు జట్లు లీగ్ మ్యాచ్ లు ఆడతాయి. రెండు గ్రూప్స్ లో టాప్- 3 లో నిలిచిన సూపర్-6 కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్ లో ఒక్కో టీం మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున మొత్తం 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. టాప్- 4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఇక సెమీ ఫైనల్ లో గెలిచిన జట్లు రెండు జట్లు టైటిల్ కోసం ఫైనల్లో తలపడతాయి.