ఇప్పట్లో గోల్డ్ రేట్లు తగ్గవ్.. 2026 ర్యాలీపై వెంచురా అంచనాలు, 10 గ్రాములు ఎంత అవుతుందంటే..?

ఇప్పట్లో గోల్డ్ రేట్లు తగ్గవ్.. 2026 ర్యాలీపై వెంచురా అంచనాలు, 10 గ్రాములు ఎంత అవుతుందంటే..?

నిపుణుల అంచనాల ప్రకారం ఇప్పట్లో ప్రపంచవ్యాప్తంగా పసిడి దూకుడుకు బ్రేక్ పడేలా లేదు. దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ బుల్ మార్కెట్ ఇప్పుడప్పుడే ముగిసే అవకాశం లేదని బ్రోకరేజ్ సంస్థ వెంచురా తాజాగా ప్రకటించింది. ఆర్థిక ఒత్తిళ్లు, ప్రపంచ సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల నేపథ్యంలో 2026 నాటికి పసిడి ధర ఔన్సుకు 4వేల600 డాలర్ల నుండి 4వేల 800 డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. అంటే ఈ లెక్కన స్వచ్చమైన 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.లక్ష 52వేలు దాటనుంది. 

ఇప్పటికే అక్టోబర్ 20, 2025న ఔన్సు గోల్డ్4వేల398 డాలర్ల రికార్డు గరిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వల్పంగా దిద్దుబాటుకు గురైనప్పటికీ, డిమాండ్ చెక్కుచెదరలేదని ఇటీవలి పెరుగుదల నిరూపిస్తోంది. డిసెంబర్ 4న స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4వేల 213 వద్ద ఉంది. దీంతో వరుసగా తొమ్మిది త్రైమాసికాల్లో బంగారం కొత్త గరిష్టాలను నమోదు చేయడం, సురక్షితమైన పెట్టుబడిగా ప్రజలు, ఇన్వెస్టర్లు దానిపై చూపిస్తున్న నమ్మకానికి నిదర్శనంగా ఉంది.

►ALSO READ | క్లౌడ్‌ఫ్లేర్ మళ్ళీ డౌన్: నెల కూడా కాకముందే మరోసారి దెబ్బతిన్న డజన్ల కొద్దీ యాప్స్, వెబ్‌సైట్స్..

వెంచురా ప్రకారం గోల్డ్ రేట్ల ర్యాలీకి సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, స్థిరంగా ఉన్న ద్రవ్యోల్బణం, అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు, 2026లో ఫెడ్ రేట్ కట్స్ కారణాలుగా ఉన్నాయి. అయితే డాలర్ తో రూపాయి మారకు రేటు పతనం కూడా రానున్న రోజుల్లో దిగుమతి ఖర్చులను పెంచి రేట్ల ర్యాలీకి ఒక కారణంగా మారొచ్చని కూడా నిపుణులు అంటున్నారు. ఇప్పటికే బలహీనమైన రూపాయి కారణంగా దుబాయ్ కంటే సుమారు 15 శాతం అధికంగా ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ముద్రించే ఫియట్ కరెన్సీలపై విశ్వాసం తగ్గడం, పెరిగిన రుణాల భారం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య బంగారం ఒక బలమైన పెట్టుబడిగా చాలా మందికి కనిపిస్తుండటం కూడా అధిక డిమాండ్ వెనుక కారణంగా నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాలిక దిద్దుబాట్లు ఉన్నప్పటికీ గోల్డ్ రేట్ల బుల్ సైకిల్ దృఢంగా 2026లోనూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.