IND vs SA: ఓపెనర్‌గా గైక్వాడ్.. నితీష్‌కు ఛాన్స్.. మూడో వన్డేకి టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పులు

IND vs SA: ఓపెనర్‌గా గైక్వాడ్.. నితీష్‌కు ఛాన్స్.. మూడో వన్డేకి టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పులు

సౌతాఫ్రికాతో జరగబోయే చివరి వన్డేకు టీమిండియా సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నం వేదికగా జరుగుతోంది. సిరీస్ లో ఇప్పటికే రెండు వన్డేలు జరిగితే తొలి వన్డేలో ఇండియా.. రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలిచి 1-1 తో సమంగా ఉన్నాయి. మూడో వన్డేలో గెలిచిన వారికి సిరీస్ దక్కుతోంది. సొంతగడ్డపై సిరీస్ పోగొట్టుకోకుండా ఉండేందుకు టీమిండియా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా రెండో వన్డే ఇచ్చిన కాన్ఫిడెంట్ తో మూడో వన్డేలోనూ టీమిండియాకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో ఫామ్ లో లేని జైశ్వాల్ ను పక్కన పెట్టి రోహిత్ తో పాటు గైక్వాడ్ ని ఓపెనర్ గా పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి కోహ్లీ సిద్ధంగా ఉన్నాడు. నాలుగో స్థానంలో రిషబ్ పంత్ కు అవకాశం దక్కొచ్చు. తొలి రెండు వన్డేలు బెంచ్ కు పరిమితమైన పంత్ మూడో వన్డేలో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదో స్థానంలో వాషింగ్ టన్ సుందర్ పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

జట్టులో కుల్దీప్ యాదవ్, జడేజా రూపంలో స్పిన్నర్లు ఉండడంతో సుందర్ స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ కు ఛాన్స్ దక్కొచ్చు. ఆస్ట్రేలియాతో తొలి వన్డే ఆడిన తర్వాత నితీష్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఫిట్ గా ఉండడంతో సుందర్ స్థానంలో ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో జట్టు యాజమాన్యం ఉన్నట్టు సమాచారం. తొలి రెండు వన్డేల్లో సుందర్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమయ్యాడు. దీంతో మూడో వన్డేలో పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఆరో స్థానంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తాడు. ఏడో స్థానంలో జడేజా.. 8 వ స్థానంలో హర్షిత్ రానా బరిలోకి దిగుతారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ఎలాగో జట్టులో ఉంటాడు. ఫాస్ట్ బౌలర్ గా అర్షదీప్ సింగ్ జట్టులో కొనసాగనున్నాడు. తొలి రెండు వన్డేలో భారీగా పరుగులిచ్చినా ప్రసిద్ కృష్ణకు ఛాన్స్ దక్కనుంది. 

సౌతాఫ్రికాతో మూడో వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 (అంచనా): 

రోహిత్ శర్మ, ఋతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ