Movie Legal Issues: కార్తి సినిమాకు కూడా అఖండ2 కష్టాలే.. "అన్నగారు వస్తారు" రిలీజ్పై హైకోర్టు స్టే

 Movie Legal Issues: కార్తి సినిమాకు కూడా అఖండ2 కష్టాలే.. "అన్నగారు వస్తారు" రిలీజ్పై హైకోర్టు స్టే

కొత్త సినిమాలు, కొత్త కబుర్లు, కొత్త బాక్సాఫీస్ లెక్కలు: ఇవే కదా సినీ అభిమానులకి ఊరటనిచ్చేవి. నిజానికి ఈ అప్డేట్స్.. సినీ ఫ్యాన్స్లో ఓ కొత్త ఉత్సాహాన్నీ తీసుకొస్తుంది. నిజానికి శుక్రవారం వస్తుందంటే థియేటర్ల వద్ద ఓ పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటి సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఇప్పుడు అర్ధంకాని పరిస్థితి వచ్చింది. తెలుగు సినీ చరిత్రలోనే చివరి నిమిషంలో ఆగిపోయిన సినిమాగా అఖండ 2 నిలిచింది. ఇది బాలయ్య అభిమానులని తీవ్ర నిరాశ కలిగించింది. అందుకు ముఖ్య కారణం నిర్మాతల ఆర్ధిక లావాదేవీలే కారణమని సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగానే.. మరో స్టార్ హీరో 'కార్తి' సినిమాకి కూడా ఆర్ధిక కష్టాలు తలెత్తాయి. ఈ క్రమంలో వచ్చే శుక్రవారం రిలీజ్ అవ్వాల్సిన సినిమా న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుపోయింది. మరి ఈ "అన్నగారు వస్తారు" అసలు సంగతి ఏంటో వివరాలు చూసేద్దాం.  

కార్తి హీరోగా నలన్ కుమార్ స్వామి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ వా వాతియార్. తెలుగులో ఈ మూవీని "అన్నగారు వస్తారు" (AnnaGaru Vastharu) అనే పేరుతో తీసుకొస్తున్న విషయం తెలిసిందే. కే.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. వచ్చేవారం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మద్రాస్ హైకోర్టు స్టే విధించడం చిత్రబృందానికి పెద్ద షాక్ ఇచ్చింది.

నిర్మాత జ్ఞానవేల్ రాజాతో పాత ఆర్థిక లావా దేవీల వివాదం ఉందని ఫైనాన్షియర్ అర్జున్ లాల్ సుందర్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ తీర్పు వచ్చింది. 2014లో ఆయనకు స్టూడియో గ్రీన్ రూ.10.35 కోట్లు అప్పు తీసుకొని ఇప్పటికీ వడ్డీతో కలిపి రూ.21.78 కోట్లు బకాయిలు ఉన్నాయని ఆరోపించారు.

బకాయిలు పూర్తిగా క్లియర్ చేసే వరకు మూవీ రిలీజ్ ఆపాలని అందులో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే విధించి ఈ నెల 8కి కేసును వాయిదా వేసింది. ఇక 8న జరిగే కోర్టు విచారణ మూవీ భవిష్యత్తును నిర్ణయించునుంది. యాక్షన్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా వస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.