ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి 2 లక్షలు.. మాదాపూర్ లో రాత్రికిరాత్రే బిచాణా ఎత్తేసిన మరో ఐటీ కంపెనీ

ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి 2 లక్షలు.. మాదాపూర్ లో రాత్రికిరాత్రే బిచాణా ఎత్తేసిన  మరో ఐటీ కంపెనీ

హైదరాబాద్ లోని  మాదాపూర్ లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ బిచానా ఎత్తేసింది.  మెడికల్ కోడింగ్ లో ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన  మైండ్ స్పార్క్  అనే కంపెనీ రాత్రికి రాత్రే చేతులెత్తేసింది.   కొండాపూర్ లోని మైండ్స్ స్పార్క్ తో పాటు మాదాపూర్ లో ఫిడిక్షన్ పేరుతో మరో కంపెనీ ఏర్పాటు చేసి నిరుద్యోగుల దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు నిర్వాహకులు .  ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర నుంచి సుమారు లక్ష నుంచి 2 లక్షలు వసూలు చేశారు. ఇలా  సుమారు 80 నుంచి 100 మంది బాధితులు లక్షలు పోగొట్టుకున్నారు. దీంతో కంపెనీ మెంటర్   శ్రీకాంత్ జోషితోపాటు దిలీప్ శివారెడ్డి పైన మాదాపూర్ పీఎస్ లో   ఫిర్యాదు చేసిన బాధితులు మాదాపూర్ లోని క్యాపిటల్ పార్క్ దగ్గర ఆందోళనకు దిగారు.  

ఐటీ కేంద్రమైన హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు సర్వ సాధారణమై పోయాయి. నిరుద్యోగులు, ఫ్రెషర్స్ను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల పేరుతో నట్టేట ముంచే బురిడీ కంపెనీలు గల్లీకొకటి పుట్టుకొస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు నడిపిస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగంపై మోజుతో నగరానికి వచ్చే యువతనే టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్నారు. 

ఐటీ జాబ్పై గంపెడాశలతో నగరానికి వచ్చే యువత నకిలీ కంపెనీల బుట్టలో ఈజీగా పడుతున్నారు. సిటీలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు రెంటల్ వర్క్ స్టేషన్లు, అపార్టుమెంట్లలో కార్యకలాపాలు చేసేవే ఎక్కువగా ఉండగా, ఇలాంటి వాటిల్లో.. 90 శాతం ఫేక్ కంపెనీలే ఉంటున్నాయనేది నిపుణుల అభిప్రాయం. ఏదో ప్రాజెక్టు ఉందని అభ్యర్థులను రిక్రూట్ చేసుకోవడం, డిపాజిట్గా కొంత మొత్తం కట్టించుకోవడం పాటు, శిక్షణ ఇతర అంశాలంటూ కాలయాపన చేసి అభ్యర్థి తనకు తానే ఉద్యోగాన్ని వదిలిపోయేలా చేస్తున్నాయి కొన్ని కంపెనీలు