కేంద్ర బడ్జెట్ 2026 భవిష్యత్ సాంకేతికతలపై భారత్ వేయబోయే భారీ అడుగులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్-టెక్ రంగాలకు పెద్దపీట వేస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నాయి. 'ఇండియాAI మిషన్' కోసం ఏకంగా రూ.2వేల కోట్లు కేటాయించడం, అలాగే విద్య, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లతో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయడం టెక్నాలజీ పట్ల ప్రభుత్వానికి ఉన్న విజన్‌ను సుస్పష్టం చేసింది.
ఈ బడ్జెట్ ప్రతిపాదనలు కేవలం AI కే పరిమితం కాకుండా.. డీప్-టెక్ ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు అవసరమైన నిధుల సేకరణ మార్గాలను కూడా సుగమం చేశాయి. ఈ నేపథ్యంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని కూడా డీప్-టెక్ స్టాక్‌లో భాగంగానే చూడాల్సి ఉంటుందని అంటున్నారు నిపుణులు. డేటా సమగ్రతను కాపాడటంలో, ప్రోటోకాల్ స్థాయిలో నమ్మకాన్ని కలిగించడంలో.. విలువైన డేటా ట్రాన్స్‌ఫర్ బ్లాక్‌చైన్ అత్యంత కీలకంగా మారింది. ప్రభుత్వం డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలనుకోవడం బ్లాక్‌చైన్ వంటి సాంకేతికతలకు పరోక్షంగా పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
క్రిప్టో రంగం విషయానికొస్తే.. ఈ బడ్జెట్ ప్రభావం కేవలం ధరల హెచ్చుతగ్గుల వంటి స్వల్పకాలిక అంశాల మీద కాకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాల మీద ఉంటుందన్నారు జియోటస్ క్రిప్టో ఎక్స్ఛేంజీ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు. దేశీయంగా R&D పెరగడం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత నియంత్రిత పద్ధతుల్లో 'ఇండియా-ఫస్ట్' అప్లికేషన్లను రూపొందించే మౌలిక సదుపాయాలు క్రిప్టో రంగానికి అసలైన బలాన్నిస్తాయని సుబ్బురాజ్ అన్నారు. ఊహాగానాలతో కూడిన ట్రేడింగ్ కంటే.. బ్లాక్‌చైన్ ద్వారా సురక్షితమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా ఈ పరిణామాలు సాగనున్నాయని అభిప్రాయపడ్డారు.
మొత్తానికి రాబోయే దశాబ్ద కాలంలో కేవలం మార్కెట్ సైకిల్స్ మీద ఆధారపడకుండా.. పటిష్టమైన టెక్నాలజీ పునాదుల మీద క్రిప్టో, బ్లాక్‌చైన్ రంగాలు నిలదొక్కుకునేలా ఈ బడ్జెట్ సంకేతాలిస్తోంది. ఎంటర్‌ప్రైజ్ అడాప్షన్, భద్రతతో కూడిన ఆర్థిక లావాదేవీల వైపు భారత్ అడుగులు వేస్తోంది. ఇది అంతిమంగా టెక్నాలజీని నమ్ముకున్న ఇన్వెస్టర్లకు, డెవలపర్లకు గొప్ప అవకాశంగా మారనుందని అంటున్నారు సుబ్బురాజ్.
