Honda Activa Mileage: భారతీయ ద్విచక్ర వాహన విభాగంలో దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న పేరు హోండా యాక్టివా. కేవలం ఒక స్కూటర్ మాత్రమే కాదు, ఇది ప్రతి ఇంటి విశ్వసనీయ భాగస్వామిగా మారింది. హోండా కంపెనీ ఇండియాలో అందిస్తున్న ఈ టూవీలర్ మోడల్.. దాని పటిష్టమైన నిర్మాణం, ఆధునిక ఫీచర్లతో రోడ్లనే కాదు, వినియోగదారుల హృదయాలను కూడా శాసిస్తోంది.
పెరుగుతున్న ఇంధన ఖర్చుల నేపథ్యంలో ఒక స్కూటర్‌ను కొనుగోలు చేసేటప్పుడు దాని మైలేజ్ గురించే చాలా మంది ఈ రోజుల్లో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో హోండా యాక్టివా తన సత్తా చాటుతోంది.యాక్టివా లీటర్ పెట్రోలుకు 59.5 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని అందిస్తుందని బైక్‌దేఖో నివేదించింది. వాస్తవంగా సరైన మెయింటెనెన్స్, రైడింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు.. వినియోగదారులు 40 నుంచి 47 కిలోమీటర్ల మైలేజీ వస్తున్నట్లు చెబుతున్నారు.
ఫుల్ ట్యాంక్‌తో హైదరాబాద్ టూ విజయవాడ..
యాక్టివా 5. 3 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. యాక్టివా 110cc మోడల్ సగటున లీటరుకు 45 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని అనుకుంటే.. ఈ స్కూటర్ ఫుల్ ట్యాంక్‌తో ఏకధాటిగా 238.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. అంటే ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే దాదాపు హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఎలాంటి చింత లేకుండా దూసుకుపోవచ్చు. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.94.77 ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో యాక్టివా ట్యాంక్‌ను పూర్తిగా నింపడానికి కేవలం రూ.502.28 మాత్రమే ఖర్చవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి యాక్టివా సరైన ఎంపిక అనడంలో సందేహం లేదు.
ఫీచర్లు, ఇంజిన్ వివరాలు..
హోండా యాక్టివా 6G అనేక అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) మెరుగైన భద్రతను అందిస్తే, ట్యూబ్‌లెస్ టైర్లు, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ సౌకర్యవంతమైన రైడ్‌ను అందిస్తాయి. యాక్టివా 110cc , 125cc అనే రెండు ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. 110cc మోడల్ 109.51cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్, BS6-కంప్లైంట్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7.99PS శక్తిని, 9.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ధర & పోటీ..
ప్రసిద్ధ హోండా యాక్టివా 110cc మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.75,182 నుండి ప్రారంభమవుతుంది. టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.88,507 వరకు ఉంటుంది. నగరాలను బట్టి ఆన్-రోడ్ ధరలు మారుతుంటాయి. ఈ ధరల విభాగంలో, యాక్టివా మార్కెట్‌లో TVS జూపిటర్, సుజుకి యాక్సెస్ వంటి మోడళ్లతో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ దాని బ్రాండ్ విశ్వసనీయత, మైలేజ్ సామర్థ్యంతో యాక్టివా స్థానం చెక్కుచెదరలేదని చెప్పుకోవచ్చు.
