న్యూఢిల్లీ: ఇండియా టేబుల్ టెన్నిస్ లెజెండ్ అచంట శరత్ కమల్ వచ్చే ఏడాది జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్‌లో పోటీపడే ఇండియా బృందానికి డిప్యూటీ చెఫ్ డి మిషన్‌గా ఎంపికయ్యాడు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ట్రెజరర్ సహదేవ్ యాదయ్‌ను చెఫ్ డి మిషన్ గా సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ నియమించింది.
వచ్చే ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్న ఈ మెగా గేమ్స్ కోసం ఇండియా టీమ్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 15 మంది సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ఇందులో శరత్ కమల్‌తో పాటు లెజెండరీ షూటర్ గగన్ నారంగ్‌కు చోటు దక్కింది. సెంట్రల్ స్పోర్ట్స్ సెక్రటరీ చైర్మన్‌గా, ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష కో– -చైర్‌గా బాధ్యతలు నిర్వర్తించే ఈ కమిటీ ఆసియా గేమ్స్ లో ఇండియా మెరుగైన పెర్ఫామెన్స్ చేయడానికి అవసరమైన వ్యూహాలు, సన్నాహాలను పర్యవేక్షించనుంది.
