పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం తర్వాత అంత స్పెషల్‌గా అనిపించిన సినిమా ‘సైక్ సిద్ధార్థ’ అని నిర్మాత సురేష్ బాబు అన్నారు. నందు హీరోగా నటిస్తూ శ్యామ్ సుందర్ రెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు. వరుణ్ రెడ్డి దర్శకుడు. యామిని భాస్కర్ హీరోయిన్. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న థియేట్రికల్‌గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా, శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘ధుమ్ ఠకుమ్’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో సురేష్ బాబు మాట్లాడుతూ ‘ఇదొక విభిన్న దృక్పథంతో తీసిన సినిమా. నందు హై ఎనర్జీతో నటించాడు.
నందు, వరుణ్, ఈ టీమ్‌ను చూస్తున్నప్పుడు నిజంగా ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారని, తప్పకుండా సపోర్ట్ చేయాలని అనిపించింది. రాఘవేంద్రరావు గారితో పాటు చాలా మందికి ఈ సినిమా చూపించాం. అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. ప్రేక్షకులకు కూడా కచ్చితంగా నచ్చుతుంది’ అని అన్నారు. నందు మాట్లాడుతూ ‘సురేష్ బాబు గారు ఎంతోమందిని హీరోలుగా చేశారు.
ఈ సినిమాను ఆయన తీసుకున్న రోజు నా ఆనందానికి హద్దులు లేవు. నాకు మాటలు రాలేదు. జీవితంలో అంత ఆనందంగా ఎప్పుడూ లేను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు గొప్ప ఆనందంతో ప్రయాణం చేస్తున్నాం’ అని చెప్పాడు. అందరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని యామిని భాస్కర్ చెప్పింది. టీమ్ అంతా పాల్గొన్నారు.
